కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోతున్న దశలో ఆ పార్టీ నేతలు చెట్టుకొకరు.. పుట్టకొకరు అయ్యారు. కొంతమంది తెలుగుదేశంలో చేరిపోగా.. మరికొంతమంది జగన్ పార్టీలోకి వచ్చారు. ఇదే సమయంలో కొందరు నేతలు భారతీయ జనతా పార్టీ పంచన కూడా చేరారు. యూపీఏ హయాంలో కేంద్రంలో మంత్రులుగా వ్యవహరించిన వారే ఇలా కమలం పార్టీలోకి జంప్ చేసేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇలా చేరిన నేతల్లో అంతగా ఆనందంగా ఉన్న వారు ఎవరూ లేరు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన వారిలో కొందరు పోటీ చేసి ఓడిపోతే.. మరికొందరు నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నా.. అవి నెరవేరలేదు. అలాగే బీజేపీ కేంద్రం లో అధికారంలో ఉందనడం కూడా వీరిని స్థానికంగా ఉపయోగపడటం లేదు. బీజేపీ వాళ్ల మాట చెల్లనీయకుండా చేస్తున్నారు తెలుగు దేశం కార్యకర్తలు. ఇక భవిష్యత్తులో అయినా బీజేపీ పుంజుకుంటుంది.. ఏపీలో బలపడుతుంది.. అనే ఆశలు కూడా ఏమీ కనపడటం లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి, రాష్ట్రంలో అధికార భాగస్వామి అయ్యి రెండేళ్లు గడుస్తున్నా బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారైంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి తరలివచ్చిన కొంతమంది నేతలు బీజేపీ నుంచి సెలవు తీసుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిలో కన్నా లక్ష్మి నారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాయలసీమ ప్రాంతానికి చెందిన మరికొంతమంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లంతా కాంగ్రెస్ ను వీడి కమలంలోకి చేరారు. అయితే వీరి రాజకీయ ప్రస్థానానికి అది ఎందుకూ ఉపయోగపడటం లేదు. దీని బదులు కాంగ్రెస్ లోనే ఉన్నా.. పార్టీ మారిన చెడ్డపేరు వచ్చేది కాదు అనే మధనం జరుగుతోంది వీళ్లలో. ఈ నేఫథ్యంలో వీరు మరోసారి పార్టీ మారడానికి సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తుండటం గమనార్హం. బీజేపీకి సెలవు ఇచ్చి.. తమ స్వారూప్యాలకు దగ్గరగా ఉండే వైకాపాలో చేరడానికి కన్నా, కాటసాని వంటి వాళ్లు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేశారనే మాట వినిపిస్తోందిప్పుడు.