ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా మంచి ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని కేంద్రప్రభుత్వం గత నెలరోజులుగా ఊరిస్తోంది. కానీ ఈసారి కూడా మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. ఈరోజు ఏపికి మొత్తం రూ.1976 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దానిలో రెవెన్యూ లోటు భర్తీ క్రింద రూ.1176 కోట్లు,రాజధాని నిర్మాణం కోసం రూ.450 కోట్లు, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి కోసం రూ.350 కోట్లు విడుదల చేసింది. కేంద్రప్రభుత్వం చెపుతున్న బారీ ఆర్ధిక ప్యాకేజి ఇదో కాదో స్పష్టం చేయలేదు కానీ త్వరలో శుభవార్త చేపుతామంటూ ఊరించి ఊరించి ఈ నిధులు విడుదల చేసింది కనుక ఇదే ఆ అద్భుతమైన ప్యాకేజి అనుకోవాలేమో. బిహార్ కి రూ.1.25 లక్షల కోట్లు, జమ్మూ కాశ్మీర్ రాష్టానికి రూ.80,000 కోట్లు ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం 2,000 కోట్లు కూడా ఇవ్వలేకపోయారు. దీనినే ప్యాకేజి అని చెప్పదలిస్తే అది ప్యాకేజి కాదు ముష్టి అని చెప్పకతప్పదు.
ఇదికాక ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వంటి అనేక హామీల సంగతి ఏమిటో ఇంకా తేల్చనే లేదు. దీనితోనే సరిపెట్టుకొని వాటిని మరిచిపోమని చెపితే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. దీనిపై తెదేపా ప్రభుత్వం స్పందన చూస్తే కానీ కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వగైరా ఇచ్చే ఆలోచనలో ఉందా లేకపోతే ఈ కధ ఇక్కడితో ముగిసినట్లేనా అనే సంగతి తెలియదు. ఒకవేళ ఇదే ఫైనల్ అనుకొంటే, దీనికి తెదేపా అంగీకరించిందా? లేకపోతే భాజపాతో కటీఫ్ చేసుకొంటుందా? అనేది కూడా దాని స్పందనతోనే తెలుస్తుంది. ఈ ఆర్ధిక ప్యాకేజిపై రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు బహుశః ఇంతకంటే చాలా ఘాటుగానే విమర్శలు గుప్పించడం ఖాయం.