కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కాశ్మీర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించాలనే అత్యుత్సాహంలో నోరు జారారు. “ప్రధాని నరేంద్ర మోడీ బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలకి మద్దతు తెలిపినందుకు అక్కడి ప్రజలు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. అందుకు మళ్ళీ ఆయన వారికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఆయన వారితో మాట్లాడేందుకు ఇష్టపడుతున్నారు కానీ కాశ్మీర్ ప్రజలతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. కాశ్మీర్ లో మనం శాంతి నెలకొల్పాలంటే, అది భారత ఆక్రమిత కాశ్మీర్ అయినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయినా చర్చల ద్వారానే సాధ్యం అవుతుంది,” అని దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
అప్పుడు వారు ‘కాశ్మీర్ ని భారత ఆక్రమిత కాశ్మీర్’ అనడం సబబేనా? అని ప్రశ్నించినప్పుడు జరిగిన తప్పుని తెలుసుకొని “నా ఉద్దేశ్యం భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని చెప్పడం తప్ప వేరే కాదు,” అని అన్నారు.
రాజకీయాలలో అపార అనుభవం, కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న దిగ్విజయ్ సింగ్ కాశ్మీర్ ని భారత ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా, పాకిస్తాన్ వాదనలకి మద్దతు ఇస్తునట్లుంది. ఒక సీనియర్ నేత ఈవిధంగా నోరు జారడం ఎవరూ ఆమోదించలేరు.
కాశ్మీర్ లో అల్లర్లని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ని కట్టడి చేసేందుకే ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ లలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావిస్తుంటే అదీ తప్పని, ఆవిధంగా మాట్లాడినందునే కాశ్మీర్ లో అల్లర్లు ఇంకా పెరిగిపోయాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం చెప్పడం కూడా పాకిస్తాన్ కి అనుకూలంగానే ఉంది. భారత్ లో ప్రజలు, రాజకీయ పార్టీలే పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలలో వేలుపెట్టవద్దని సూచిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోడీ వేలు పెడుతున్నారని పాకిస్తాన్ వాదించడానికి చిదంబరం తన వ్యాఖ్యలతో అవకాశం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఈవిధంగా దేశభద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాలలో కూడా నోటికి వచ్చినట్లు వాగడం వలన పాకిస్తాన్ ముందు భారత్ తలదించుకొనే పరిస్థితి కల్పిస్తున్నారు. బహుశః అందుకే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి ముసలి గుర్రాలని అన్నిటినీ బయటకి పంపేయాలని భావిస్తున్నారేమో?