రాజకీయాల్లో మాటలకు, వాటి వెనుక అర్థాలకు మధ్య అంతరంపై ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. పవన్ కల్యాణ్ పోరుబాట ప్రకటన వెనుక మతలబు ఏమిటంటూ పరిశీలకులు పలురకాల విశ్లేషణలు చేయడం కూడా సహజం.
ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటంలో ముందున్నది నేనంటే నేనంటూ పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ మిత్రపక్షమైనా హోదాపై రాజీలేదంటుంది టీడీపీ. టీడీపీ అసమర్థత వల్లే హోదా రావడం లేదంటుంది వైసీపీ. ప్రయివేట్ మెంబర్ బిల్లు ద్వారా కదలిక తెచ్చామని చెప్పుకుంటుంది కాంగ్రెస్. ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ వంతు.
తాను ప్రచారం చేసిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పవన్ పోరుబాట పట్టాలని నిర్ణయించారు. తిరుపతి సభలో సమర శంఖం పూరించారు. దీనివెనుక ఒక పక్కా ప్లాన్ ఉండొచ్చనే విశ్లేషణలు లేదా స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. జగన్ కు అవకాశం ఇవ్వకుండా పవన్ ను ముందు వరుసలో నిలపడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం కావచ్చనే అంచనాలు వినవస్తున్నాయి. వీటిని పవన్ ఖండిస్తారో లేక మౌనం వహిస్తారో తర్వాతి సంగతి.
పవన్ ప్రసంగాన్ని గమనిస్తే హోదాకోసం పోరాడుతూనే టీడీపీ పై తీవ్రమైన విమర్శల దాడి ఉండదనే సంకేతం కనిపిస్తుంది. కాంగ్రెస్ ను తూర్పార పట్టిన తీరు కూడా ఆయన గేమ్ ప్లాన్ కు మరో సంకేతం. ప్రస్తుతం హోదా విషయంలో టీడీపీ ఎక్కువ పెడుతున్నది వైసీపీ. కాబట్టి జగన్ కు చెక్ పెట్టాలంటే పవన్ ఓ బ్రహ్మాస్త్రం కావచ్చనే వ్యూహంలో భాగంగా ఈ కొత్త పోరాటం మొదలు కాబోతుందని కొందరు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పనిలో పనిగా హోదా కోసం తీవ్రంగా పోరాడటం ద్వారా జనసేన ఇమేజి కూడా పెరిగే అవకాశం ఉంది.
పవన్ మాటలే తప్ప చేతల మనిషి కాదని ప్రత్యర్థులు రెండేళ్లుగా విమర్శిస్తున్నారు. ఆ విమర్శలను తిప్పికొట్టడం కూడా పవన్ కు అవసరం. లేకపోతే విశ్వసనీయత పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. అన్నయ్య గెలిచిన చోటే తమ్ముడు సమర శంఖం మోగించాడు. మరి హోదాపోరును ఎంత ముందుకు తీసుకెళ్తాడో వేచి చూద్దాం.