జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా తిరుపతి సభను ప్రకటించడమే గాక తన మార్గమేమిటో ప్రకటించడం స్వాగతించదగింది. బాగా ఆలస్యం చేసినా సమయం తీసుకున్నా మాట్లాడిన మేరకు సూటిగానూ స్పష్టంగానూ మాట్లాడారు.
చూడప్పా సిద్దప్పా .. అని గతంలో సరదాగా వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యాతగా ఈ మార్పును స్వాగతిస్తాను. ఒక్కణ్ని ఏం చేయగలను అన్నప్పుడు కూడా విమర్శించాను. అయిుతే తిరుపతిలో విభతితాంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చిన మాట నిలుపుకోలేని బిజెపి ప్రభుత్వాన్ని, దానిపై గట్టిగా పోరాడకుండా రాజకీయ విన్యాసాలతో సరిపెడుతున్న తెలుగుదేశం నాయకత్వాన్ని పార్లమెంటులో తిష్టవేసిన కోటీశ్వర నేతలను ఆయన బాగానే తూర్పారబట్టారు. .
బిజెపి టిడిపి అంతకు ముందు కాంగ్రెస్‌లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు నూటికి రెండు వందల శాతం నిజం. వీటిపై తెలుగుదేశం స్పందించక పోవడం వ్యూహాత్మకం తప్ప దానికి పవన్ కళ్యాణ్‌ను ముడిపెట్టి చూడనవసరం లేదు. ఆయనను చంద్రబాబు బాణంగా వర్ణించడం తొందరపాటు. నిజంగా రేపు అలా చేస్తే ఆయనకే అస్తిత్వం వుండదు. అంత నాటకం ఆడాల్సిన అవసరం శక్తి ఆయనకు వుండకపోవచ్చు కూడా. గతంలో అమరావతి భూముల విషయమై పర్యటించి తర్వాత ముఖ్యమంత్రితో కలసి మాట్లాడి సర్దుకున్న సంగతి నిజమే గాని ఆ ధోరణిని సవరించుకునే అవకాశం ఆయనకు ఇవ్వాలి.
చంద్రబాబును కూడా అఖిలపక్షం పిలిచి అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పడం దిద్దుబాటుకు అవకాశమే. కాని తెలుగుదేశం తాను పోరడదు, పోరాడేవాళ్లను కలుపుకోదు. పవన్ చెప్పిన లొసుగులు ఏమున్నాయో వారికే తెలియాలి. అయితే ప్రతిపక్షమైన వైసీపీ హడావుడిగా పవన్ చంద్రబాబు చేతి పనిముట్టు అని మరొకటి అని ఆరోపించడం అనుచితం. నిజానికి ఆయన ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటిగా వైసీపీని ప్రస్తావించారు.బిజెపిపై వైసీపీ చేసే విమర్శల కంటే పవన్ చాలా నిశిత విమర్శలు చేశారు. పవన్ తమ పార్టీలో చేరతాడని ప్రచారం చేసుకున్న బిజెపికి ఇది పెద్ద ఆశాభంగమే గాక ఒకింత శృంగభంగం కూడా. అమిత్ షా తనను ఆహ్వానించినా తిరస్కరించానని పవర్ స్టార్ చెప్పేశారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంలో ప్రధాన దోషం బిజెపిది, తర్వాత టిడిపిది. తిరుపతి సభతో పవన్ కళ్యాణ్ ఆ త్రయంలో తన వంతు పాత్రను తనే విడగొట్టుకున్నారు. మళ్లీ నెత్తిన పెట్టుకోవడం ఆత్మహత్యాసదృశమని ఆయనకూ తెలుసు. ఇప్పుడు ఆయన ఏ మేరకు పోరాడతారు ఆచరణలో చూసి నిర్ణయించాలి గాని ముందే ి ముద్రలు వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు తీసుకున్న వైఖరి ా ప్రజలను ఉత్సాహపరుస్తుంది. గతంలో కేంద్ర రాష్ట్ర పాలక పక్షాలకు అనుకూల వ్యక్తిగా షాక్ అబ్జార్బర్‌గా తనపై పడిన ముద్రను పోగొట్టుకోవడం పవన్ కళ్యాణ్ బాధ్యత. ఇంతదూరం వచ్చారు గనక వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారనే ఆశించాలి తప్ప శాపనార్థాలు పెట్టనవసరం లేదు. నా వరకు నేను ఆయన రాజకీయ ప్రవేశం సమయంలోనే స్వాగతించిన క్లిప్పింగులు నెట్లో చూడొచ్చు. తర్వాత బిజెపి టిడిపి కూటమిలో భాగస్వామి కావడంతో ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు ఆయన స్పష్టంగా ురావడం మంచి పరిణామమే.అయితే ఒకటి రెండు సభలతో గాక విస్త్రత కార్యాచరణతో ఆయన ముందుకు వస్తే ఈ మాటలు సార్థకమవుతాయి.పరిగెత్తితేనే పరాక్రమశీలి అవుతారు.