ఇటీవల తిరుపతిలో ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ అభిమానుల మద్య ఘర్షణ హత్యకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఘనట గురించి తెలుసుకొన్న పవన్ చలించిపోయాడు. తన అభిమాని ఇంటికి వెళ్లి ఆ తల్లిని ఓదార్చి వచ్చాడు. తన అభిమానులకూ క్లాస్ పీకాడు. అభిమానం హద్దుల్లో ఉండాలని, తామంతా బాగానే ఉంటామని సూచించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే మాట చెబుతున్నాడు. ప్రత్యేకంగా తిరుపతి ఘటనను ప్రస్తావించకపోయినప్పటికీ అభిమానులకు క్లాస్ పీకాడు. సినిమా అనేది రెండున్నర గంటల వినోదం మాత్రమే అని.. దాని కంటే జీవితం విలువైనదని సూచించాడు.
ఓ ఇంటర్వ్యూలో అభిమానుల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ముందు దేశాన్ని, ఆ తరవాత కుటుంబాన్నీ, ఆ తరవాత స్నేహితుల్ని చివరకు.. నచ్చిన నటుడ్ని అభిమానించండి.. మితిమీరిన అభిమానం వద్దు.. అంటూ హితవు పలికాడు. ”నన్ను నన్నుగా చూడండి చాలు. నేను నటుడ్ని.. సాధారణ మనిషిని.. దేవుడ్ని కాదు” అన్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వేడుకలోనూ ఎన్టీఆర్ ఇదే చెప్పాడు. తన కటౌట్ల దగ్గర జంతు బలలు ఇవ్వొద్దని, పాలాభిషేకాల పేరుతో పాలను వృథా చేయొద్దని అభిమానుల్న కోరుకొన్నాడు. మరి ఇప్పటికైనా తారక్ ఫ్యాన్స్ మారతారో లేదో??