సమైక్య రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా ఏలినవారిలో చాలామంది రాయలసీమకి చెందినవారే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్న చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతలు కూడా సీమకి చెందినవారే. కానీ ఎవరూ సీమకి న్యాయం చేయలేకపోతున్నారనేది చేదు వాస్తవం. రాష్ట్ర విభజన తరువాత సీమలో కొంత అభివృద్ధి పనులు మొదలైనప్పటికీ అవి ఆశించినంతగా, సీమ ప్రజలకి సంతృప్తి కలిగించే స్థాయిలో మాత్రం లేవనే చెప్పవచ్చు. తెదేపా ప్రభుత్వం పట్టిసీమ బాజాలు చాలా గట్టిగానే వాయించుకొంది కానీ దాని ద్వారా సీమ జిల్లాలకి నీళ్ళు అందిన దాఖలాలు లేవు.
కడపకి చెందిన జగన్మోహన్ రెడ్డి, అనంతపురానికి చెందిన రఘువీరా రెడ్డి ఈ రెండేళ్లలో తమ తమ పార్టీలని ఏవిధంగా బలోపేతం చేసుకోవాలనే ఆలోచించారు తప్ప సీమ ప్రజల తరపున ప్రభుత్వంతో గట్టిగా పోరాడింది లేదు. సాధించింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నారని నిత్యం విమర్శలు చేసే వారిద్దరూ కూడా తమ పార్టీ ప్రయోజనాల కోసమే ఆలోచించారు తప్ప సీమ గురించి ఆలోచించలేదు, పోరాడలేదనే చెప్పక తప్పదు.
వైకాపాకి హటాత్తుగా ఆ సంగతి అర్ధం అయ్యిందో లేకపోతే తన కడప కంచుకోటని బలపరుచుకొనే ప్రయత్నంలోనో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సెప్టెంబర్ 3వ తేదీనమహాధర్నా నిర్వహించబోతోంది. సాగునీటి సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీమ జిల్లాల పట్ల తీవ్ర అశ్రద్ధ చూపుతోందని ఆరోపిస్తూ వైకాపా నేతలు ఈ మహాధర్నాకి సిద్దం అవుతున్నారు. తెలుగుగంగ, కేసి కెనాల్, గండికోట ప్రాజెక్టులకి నీళ్ళు అందింఛి సీమ రైతులని ఆదుకోవాలనే తమ అభ్యర్ధనలని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ మహాధర్నా చేయవలసి వస్తోందని జిల్లా వైకాపా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ ధర్నాకి ముందు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించిన తరువాత సెప్టెంబర్ 3న జరిగే మహాధర్నాలో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన సీమ ప్రాంతానికి చాలా నష్టం అవుతుందని వాదిస్తూ కర్నూలులో రెండు రోజులు దీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తరువాత మళ్ళీ ఆ ఊసే ఎత్తకపోవడం గమనిస్తే ఆయనకి, వైకాపాకి సీమ పట్ల చిత్తశుద్ధి లేదనే సంగతి స్పష్టం అవుతుంది. కనుక కడపలో నిర్వహించబోయే మహాధర్నా కూడా ప్రజలని, రైతులని ఆకట్టుకొని జిల్లాలో వైకాపాని బలోపేతం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగానే భావించవలసి ఉంటుంది. ఆ మహాధర్నా తరువాత తీవ్రమైన ఆ సమస్యని కూడా వైకాపా పక్కనపడేసి మరో సమస్యపై పోరాటానికి షిఫ్ట్ అయిపోయినప్పుడు, దానికి సీమ పట్ల చిత్తశుద్ధి లేదనే విషయం మరొకమారు దృవీకరించబడుతుంది.