కాపులకి రిజర్వేషన్ల విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ నెలాఖరులోగా తగిన చర్యలు చేపట్టాలని ముద్రగడ పద్మనాభం చాలా రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ సమయం దగ్గర పడుతుండటంతో ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం దీని గురించి నిర్దిష్టమైన ప్రకటన చేయకపోతే మళ్ళీ ఉద్యమం ప్రారంభిస్తామని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెప్టెంబర్ 11న రాష్ట్రంలో అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమయ్యి కాపులకి రిజర్వేషన్లు సాధించేందుకు ఏవిధంగా ముందుకు సాగాలో ఆలోచించి తగిన ప్రణాళిక సిద్దం చేసుకొంటామని ముద్రగడ తెలిపారు.
ఈ సందర్భంగా అయన పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు సిద్దం అవుతుంటే, తాను కాపులకి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ తన కాపు ఐడెంటిటీని స్వీకరించినా స్వీకరించకపోయినా, రాష్ట్రంలో కాపులు అందరూ ఆయనని తమవాడిగానే భావించడం సహజమే. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 9న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తన పోరాటం మొదలుపెట్టబోతుంటే, ముద్రగడ సెప్టెంబర్ 11న రాజమండ్రిలో తన పోరాటం మొదలుపెట్టబోతున్నారు. అంటే ఒకే కులానికి చెందిన ఇద్దరూ ఇంచుమించు ఒకేసమయంలో ఒకే జిల్లాలో రెండు వేర్వేరు సమస్యలపై పోరాటం మొదలుపెట్టబోతున్నారు.
పవన్ కళ్యాణ్ చేయబోయే ఉద్యమం యావత్ రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే ముద్రగడ కేవలం కాపులకోసమే చేస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ కి మంచి ప్రజాధారణ, అభిమానుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కనుక సహజంగానే ప్రజలందరి దృష్టి పవన్ కళ్యాణ్ చేయబోయే ఉద్యమంపైనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈసమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాటానికి దిగడం వలన తన పోరాటానికి ప్రాధాన్యత తగ్గుతుందనే విషయం బహుశః ముద్రగడ కూడా గ్రహించే ఉండవచ్చు. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారేమో? బహుశః వైకాపా కూడా అందుకే పవన్ కళ్యాణ్ ఉద్యమ ప్రకటనని స్వాగతించలేకపోయిందేమో? అందుకే ఆయనని తెదేపా ఏజంటుగా చూపే ప్రయత్నం చేస్తోందేమో? ఏమో?