ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్థలం ఎంపిక మొదలుకొని భూసేకరణ, నిధుల కొరత, స్విస్ చాలెంజ్, భవనాల డిజైన్ల వరకు ప్రతీ పనిలో అవరోధాలు ఎదురవుతూనే ఉండటం రాష్ట్ర ప్రజలని కూడా తీవ్ర నిరాశాపరుస్తోంది. అమరావతి నిర్మాణ వ్యవహారాలు మూడడుగులు ముందుకి రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. ఇంతవరకు స్విస్ చాలెంజ్ కధే తేలలేదు. తాజాగా రాజధానిలో భవనాల డిజైన్ల విషయంలో కూడా కధ మళ్ళీ మొదటికొచ్చింది. జపాన్ కి చెందిన మాకి సంస్థ, భారత్ లో కొన్ని కంపెనీలు ఇచ్చిన డిజైన్లలో ఏవీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నచ్చకపోవడంతో మళ్ళీ అధ్యయనం కోసం సి.ఆర్.డి.ఏ. కమీషనర్ సిహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఒక బృందం టోక్యో, ఆస్థానా, సింగపూర్, మలేషియా దేశాలకి సోమవారం బయలుదేరుతోంది. వారు విదేశీపర్యటన చేసి వచ్చి ముఖ్యమంత్రికి తమ నివేదిక అందించిన తరువాత దానిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది.
ఈ ప్రక్రియ అంతా ముగిసేసరి మరో మూడు నాలుగు నెలలైనా పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఆ పనులు కొంచెం ముందుగానే పూర్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి ‘స్విస్ ఛాలెంజ్’ అనే ఒక సవాలు ఉండనే ఉంది. అది ఇంకా క్లిష్టమైనది, వివాదాలతో కూడుకొన్నది. దానిపై ప్రతిపక్షాలు కూడా చాలా అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కనుక ఈ ఏడాదిలో నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం లేనట్లే భావించవచ్చు.
రాజధాని పనులు ఎప్పుడు మొదలవుతాయా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఇది చాలా నిరాశ కలిగించే విషయమే. అటువంటి బారీ ప్రాజెక్టుని మొదలుపెట్టే ముందే చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమే కానీ దానికి రెండున్నరేళ్ళు చాలా ఎక్కువ సమయమేనని చెప్పకతప్పదు. ఈవిధంగా నత్త నడకలు నడుస్తుంటే రాజధాని నిర్మాణపనులు ఇంకా ఎప్పుడు మొదలవుతాయో అని నిట్టూర్పులు విడవక తప్పడం లేదు.
ఒకవేళ తెదేపా ప్రభుత్వం 2019 ఎన్నికలలోగా రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టలేకపోయినట్లయితే, ఆ హామీని కూడా అది నిలబెట్టుకోలేకపోయినటే అవుతుంది కనుక దానికీ బారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే, రాజధాని నిర్మించబోయే ప్రాంతంతో సహా మళ్ళీ అన్నీ మారిపోవచ్చు కనుక కధ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్మాణ పనులు మొదలుపెట్టడం చాలా అవసరం.