తెదేపా పునాదులని కుదిపివేసిన ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. అయితే ఈసారి తెలంగాణా ప్రభుత్వం నుంచి కాకుండా ఏపిలో మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసిబి కోర్టులో పిటిషన్ వేయడం వలన కదలిక రావడం విశేషం. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణా నామినేటడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఫోన్లో మాట్లాడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో కూడా పేర్కొంది కనుక ఆయనని కూడా నిందితుడుగా చేర్చి మళ్ళీ మొదటి నుంచి పునర్విచారణ చేయాలని కోరుతూ రామకృష్ణా రెడ్డి తెలంగాణా ఏసిబి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏసిబి న్యాయస్థానం దానిపై సోమవారం విచారణ చేసింది. ఈ కేసుపై వచ్చేనెల 29వ తేదీలోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఏసిబి అధికారులని ఆదేశించింది.
ఈసారి కూడా తెలంగాణా ప్రభుత్వం ఆ కేసుని త్రొక్కి పెడుతుందా లేకపోతే ముందుకు సాగనిస్తుందా అనేది చూడవలసి ఉంది. ఒకవేళ ముందుకు సాగనిస్తే రెండు రాష్ట్రాలలో తెదేపాకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది కనుక ఆత్మరక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ కేసుని అటక మీద నుంచి క్రిందకు దింపి విచారణ మొదలుపెట్టవచ్చు.