చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. సెట్లో ఈరోజు ఇద్దరు అతిథులు వచ్చారు. అయితే చిరు కోసం మాత్రం కాదు. సెట్లో ఉన్న కాజల్ కోసం. ఆ అతిథులే దిల్‌రాజు, హరీష్ శంకర్. వీరిద్దరూ కాజల్‌తో చాలాసేపు మంతనాలాడి వెళ్లిపోయారు. చిరు సెట్లో వాళ్లకేం పని, కాజల్‌తో ఏం మాట్లాడారు? అనే ఆసక్తి నెలకొంది. దిల్‌రాజు సినిమా డిజె (దువ్వాడ జగన్నాథమ్) ఈరోజు హైదరాబాద్‌లో మొదలైంది. అల్లు అర్జున్ పక్కన కథానాయిక ఎవ్వరూ సెట్ కాలేదు. హీరోయిన్ పేరు చెప్పకుండానే ఈసినిమాని పట్టాలెక్కించేశారు. మరో పదిహేను రోజుల్లో షూటింగ్ మొదలవ్వనుంది. ఈలోగా కథానాయికని సెట్ చేసుకోవాలి కదా? అందులో భాగంగానే దిల్‌రాజు, హరీష్ శంకర్లు కాజల్‌ని కలిసొచ్చారన్నమాట.
గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం.. ఇలా వరుస ఫ్లాపులతో తల్లడిల్లిపోయింది కాజల్. తెలుగులో కాజల్ పని ఇక ఖతం అనుకొన్న దశలో చిరు సినిమాలో అనుకోని ఆఫర్ వచ్చింది. ఈలోగా.. జనతా గ్యారేజ్‌లో తన కెరీర్లోనే తొలిసారి ఐటెమ్ పాట చేసింది. ఇప్పుడు బన్నీ సినిమా కూడా పట్టేసుకొంటే కాజల్ కెరీర్ మళ్లీ గాడిలో పడినట్టే. ఓ వైపు బడా హీరోయిన్లు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి దశలో.. చిత్రసీమకు కథానాయికల కొరత వచ్చింది. అందుకే పక్కన పెట్టేసిన కాజల్ చుట్టూనే మళ్లీ సినిమాలు చేరుతున్నాయి. అన్నీ కుదిరితే.. అల్లుఅర్జున్‌తో కాజల్ మరోసారి జోడీ కట్టేయడం ఖాయం. అన్నట్టు ఈ సినిమాలో మరో కథానాయికకీ చోటుంది. ఆ స్థానంలో ఎవరొస్తారో చూడాలి.