ఒకప్పుడు వైకాపా ఫ్లెక్సీ బ్యానర్స్ పై సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ముద్రించి తెదేపాలో చిచ్చుపెట్టిన వైకాపా తాజాగా ఓటుకి నోటు కేసుతో తెదేపాని మరోసారి చావు దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తోంది. వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే అల్లా రామకృష్ణా రెడ్డి ఓటుకి నోటు కేసుని పునర్విచారణ చేయాలని కోరుతూ ఏసిబి కోర్టులో పిటిషన్ వేసి తెదేపాకి ఊహించని పెద్ద షాక్ ఇచ్చారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ కేసు గురించి నోరు విప్పలేదు. ఈ కేసు కొంచెం ముందుకి సాగిన తరువాత పరిస్థితులని బట్టి మాట్లాడతారేమో?లేకుంటే ఆయనే ఈ కుట్ర చేశారని తెదేపా నేతలు విమర్శించే అవకాశం ఉంటుంది.
ఇంతవరకు ఈ కేసులో తెలంగాణా ప్రభుత్వం నుంచే ప్రమాదం పొంచి ఉందని అందరూ భావిస్తున్నారు తప్ప రాష్ట్రంలో వైకాపా నుంచి కూడా ఈవిధంగా ప్రమాదం ముంచుకు వస్తుందని తెదేపా కూడా ఊహించలేకపోయింది లేకుంటే ముందే జాగ్రతపడేది.
వైకాపాలో నోరున్న నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎడాపెడా దులిపిపడేశారు. అంబటి రాంబాబు మరో అడుగు ముందుకు వేసి ఈసారి చంద్రబాబు నాయుడుని ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్య నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కాపాడలేరని జోస్యం చెప్పారు.
సాక్షి మీడియాలో కూడా అప్పుడే ఈ కేసు గురించి మళ్ళీ జోరుగా కధనాలు, ఊహాగానాలు ప్రచురించడం ప్రారంభించేసింది. ముఖ్యమంత్రి పర్యటనలో చిన్న మార్పు జరిగినా దానిని ఈ కేసుతో ముడిపెట్టేసి కధనాలు ప్రచురించేస్తూ ఈకేసుకి మళ్ళీ ఇదివరకటి హైప్ క్రియేట్ చేసేందుకు ఉడతా భక్తిగా సాక్షి తన వంతు కృషి చేసేస్తోంది.
ఈ కేసు గురించి తెదేపా నేతలు ఎవరూ కూడా ఇంతవరకు నోరు మెదపలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆయన సూచనల ప్రకారం మాట్లాడతారేమో? సెప్టెంబర్ 29లోగా ఈ కేసుని పునర్విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఏసిబి కోర్టు గడువు పెట్టింది కనుక ఏసిబి అధికారులు నిందితులకి సమన్లు జారీ చేయడం మొదలుపెడితే రెండు రాష్ట్రాలలో మళ్ళీ వేడి పెరిగే అవకాశం ఉంటుంది. భూతంలాగా వెంటాడుతున్న ఈ కేసు నుంచి బయటపడటానికి తెదేపా ఇప్పటికైనా ఏదో ఒక మంచి ఉపాయం ఆలోచించక తప్పదు లేకుంటే పార్టీ, ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిష్ట చాలా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.