వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహం సహాయ సహకారాలతోనే ముద్రగడ పద్మనాభం ఉద్యమం కొనసాగిస్తున్నారనే తెదేపా నేతలు వాదిస్తున్నారు. ఆయన మాటలు, లేఖలో వాడుతున్న బాష, కాపు ప్రముఖులతో సమావేశాలు అన్నీ కూడా వారి వాదనలకి బలం చేకూర్చేవిగానే కనిపిస్తున్నాయి. మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావుని జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కలిసినప్పుడే ఆయన ఇంట్లోనే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టబడిందనే వాదనకి బలం చేకూర్చుతూ ముద్రగడ పద్మనాభం ఆయనతో నిన్న సమావేశమయ్యారు. మళ్ళీ ఈరోజు కూడా ఆయన ఇంట్లోనే కాంగ్రెస్, వైకాపా నేతలు చిరంజీవి, పల్లం రాజు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరికొందరు కాపు పెద్దలు సమావేశం కాబోతున్నారు. కాపులకి రిజర్వేషన్లు సాధించేందుకు ఏవిధంగా ముందుకు సాగాలనే దానిపై నేడు వారు చర్చించనున్నారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని దాసరి నారాయణ రావు చెప్పారు.
వచ్చే నెల 11వ తేదీన రాజమండ్రిలో 13జిల్లాల కాపు సంఘాల నేతలతో సమావేశం అయ్యి భవిష్య కార్యాచరణ నిర్ణయించుకోవాలనుకొన్నట్లు ముద్రగడ పద్మనాభం స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యమం ముందుకు సాగడానికి అటువంటి సమిష్టి నిర్ణయం చాలా అవసరం కూడా. కానీ అంతకంటే ముందుగా దాసరి నారాయణ రావు ఇంట్లో కాంగ్రెస్, వైకాపా నేతలతో ముద్రగడ సమావేశం అవడమే అనుమానాలకి తావిస్తోంది. వారిలో ముద్రగడ తప్ప మరెవరూ కూడా నేరుగా ఉద్యమంలో పాల్గొనలేదు. పాల్గొనే ఉద్దేశ్యం కూడా లేదు. వైకాపా నేతలైతే ఆయనని వెనుక నుంచి తాము ప్రోత్సహించడం లేదని వాదిస్తున్నారు. ఆయన కూడా తన వెనుక జగన్ లేడని పదేపదే వాదిస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ ఉద్యమంలో 13 జిల్లాల కాపు సంఘాల నేతల మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. త్వరలో వారితోనే సమావేశం అవుతున్నప్పుడు, ఈ ఉద్యమంతో సంబంధం లేదని, దానిలో ఎన్నడూ పాల్గొనడానికి ఇష్టపడని చిరంజీవి, పల్లం రాజు, దాసరి, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి, బొత్స వంటి వారితో ముద్రగడ పద్మనాభం రహస్యంగా సమావేశాలు నిర్వహించవలసిన అవసరం ఏమిటి? వారు ఈ ఉద్యమం గురించే చర్చిస్తున్నప్పుడు దానిలో పాల్గొనబోయే 13 జిల్లాల కాపు సంఘాల నేతలని దాసరి ఇంట్లో జరుగుతున్న ఈ సమావేశాలకి ఎందుకు ఆహ్వానించలేదు?అనే సందేహాలు కలుగుతాయి.
ముద్రగడ పద్మనాభం నిజంగా కాపులకి రిజర్వేషన్ల కోసమే పోరాడుతున్నట్లయితే పూర్తి పారదర్శకత పాటించడం చాలా అవసరం. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొనే వారితోనే చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకొంటే ఎవరికీ ఇటువంటి అనుమానాలు రావు. అలాగ కాకుండా ఈ ఉద్యమంతో సంబంధం లేదని చెపుతున్న ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యి నిర్ణయాలు తీసుకొని, వాటికి 13 జిల్లాల కాపు సంఘాల నేతలతో ఆమోదముద్ర వేయించాలనుకొంటే సరికాదు. ఇటువంటి ఉద్యమాలకి ప్రతిపక్షాలు మద్దతు చాలా అవసరమే కానీ అవి తమతమ ఇతర కులాల ఓటు బ్యాంక్ లని నష్టపోకూడదనే భయంతో ఆయన చేస్తున్న ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలపడానికి సంకోచిస్తున్నాప్పుడు వారితో సమావేశం అవుతున్నందునే ఆయన చిత్తశుద్ధిని శంకించక తప్పడం లేదు. ఆయన కాంగ్రెస్, వైకాపాల చేతిలో అస్త్రంగా మారిపోయినట్లు అనుమానం కలుగుతోంది. కనుక ఇప్పటికైనా ఆయన తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే కాపు సంఘాల నేతలతోనే చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. లేకుంటే వారు కూడా ఆయన చేసే ఈ పోరాటాన్ని తమ కోసం చేస్తున్న పోరాటంగా కాక రాజకీయ పోరాటంగా భావించి ఆయనకి దూరం కావచ్చు. అప్పుడు ఈ దాసరి, బొత్స, చిరంజీవి, అంబటి తదితరులు ఆయనని ఆదుకోకపోవచ్చు. చివరికి ఆయనే మళ్ళీ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.