సీనియర్ కాంగ్రెస్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రు), ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ఈరోజు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెదేపాలోకి మళ్ళీ రావడం నాకు పుట్టింటికి వచ్చినట్లే ఉంది కానీ నాకుమారుడు అవినాష్ కి తెదేపా కొత్త పార్టీయే. కాంగ్రెస్ పార్టీతో అనుబందం తెంచుకొని రావడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ, మా అనుచరుల కోసం మేము తెదేపాలోకి చేరుతున్నాము. అందుకోసం మా అబ్బాయి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా వదులుకొన్నాడు. మేము పార్టీ నుంచి ఏమీ ఆశించడం లేదు. చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పార్టీ కోసం పనిచేస్తాము. వీలైతే రాజధాని నిర్మాణంలో ఉడతా భక్తిగా సహాయపడతాము,” అని అన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన దేవినేని నెహ్రు తెదేపాతోనే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత తెదేపాలో పరిస్థితులు మారి ఏకాకిగా మిగిలిపోవడంతో 1997లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు కానీ ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలలో పాల్గొనడం తగ్గించేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి తెదేపాలో చేరి పూర్తి స్థాయి రాజకీయాలకి సిద్దం అయ్యారు.
కృష్ణా జిల్లా రాజకీయాలపై దేవినేని నెహ్రుకి మంచి పట్టుంది. ఆయన పట్ల ప్రజలలో కూడా మంచి ఆదరణ ఉంది. వారితో బాటే అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి కాంగ్రెస్ నేతలు కూడా తెదేపాలో చేరిపోబోతున్నారు కనుక ఇది కాంగ్రెస్ పార్టీకి మరోపెద్ద దెబ్బవుతుంది.
అయితే ఇప్పటికే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి సీనియర్ నేతలతో నిండిపోయి ‘హౌస్ ఫుల్ బోర్డు’ పెట్టుకొనే పరిస్థితి నెలకొని ఉంది. ఈ మధ్యనే వైకాపా నుంచి జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రు తదితరులు కూడా వచ్చి తెదేపాలో చేరారు. కనుక దేవినేని నెహ్రు, అవినాష్ రాకతో ఒకే ఒరలో అనేక కత్తులు పెట్టుకొని తిరుగుతున్నట్లు అవుతుంది. వారి రాకతో పార్టీ ఇంకా బలపడినప్పటికీ, తెదేపాలో పాత, కొత్త, సీనియర్, జూనియర్ నేతలు, వారి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ఒకే జిల్లాలో డజన్లు కొద్దీ సీనియర్, జూనియర్ నేతలుంటే, ఎన్నికల సమయంలో వారందరికీ టికెట్స్ ఇవ్వడం కూడా సాధ్యం కాదు కనుక పార్టీ నేతలలో ఇప్పటి నుంచే అభద్రతాభావం, అసంతృప్తి క్రమంగా పెరిగి చివరికి అవి ఘర్షణలకి ఆ తరువాత పార్టీ మార్పులకి దారి తీయవచ్చు. కనుక ఇకనైనా తెదేపా ఈ లెక్కలన్నీ సరిచూసుకొని కొత్తవారిని తీసుకోవడం మంచిదేమో? లేకుంటే అది ఆశించింది ఒకటయితే మరొకటి జరుగవచ్చు.