ప్రత్యేక హోదా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో మళ్ళీ దానిపై రాష్ట్రంలో వేడి పెరిగింది. ముఖ్యంగా ఆయన తెదేపా, భాజపాలని ఉద్దేశ్యించే ఘాటుగా విమర్శలు చేయడంతో ఆ రెండు పార్టీలు నిద్ర లోంచి మేల్కొన్నాయి. ఈ విషయంలో ఆ రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలని చూసి విసుగొస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు కూడా తమ మాటలతో విసిగెత్తి పోయున్నారనే సంగతి వారికీ తెలుసు కానీ ఆ విషయం పవన్ కళ్యాణ్ నోటి ద్వారా వినేసరికి ఉలిక్కిపడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి పోరాటం మొదలుపెడితే, ప్రజల ముందు ఇంక తలెత్తుకొని తిరుగలేమనే సంగతి వారికీ అర్ధం అయ్యింది. అందుకే గత నాలుగు రోజులుగా ఆ రెండు పార్టీల నేతలు, మంత్రులు ప్రత్యేక హోదా, ఇతర హామీల కోసం మళ్ళీ కేంద్రప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టారు. మళ్ళీ మంగళవారం కూడా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుజనా చౌదరి తదితరులు సమావేశం అయ్యి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ తో సహా అన్ని హామీల అమలుగురించి చర్చించారు.
ఇదివరకు హామీల అమలుగురించి రాష్ట్రంలో ప్రతిపక్షాలు గొడవ చేసినప్పుడల్లా తెదేపా నేతలు, మంత్రులు కేంద్రప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఆ వేడి చల్లారగానే మళ్ళీ ఆ సంగతి మరిచిపోయేవారు లేదా మరిచిపోయినట్లు నటించేవారు. ఇప్పుడు ఆ డ్రామాలని కూడా ప్రజలు నమ్మడం లేదు కనుక రాష్ట్రంలో వేడి పెరిగినప్పుడల్లా ఈవిధంగా సమావేశాలతో కాలక్షేపం చేస్తూ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ప్రత్యేక హోదా తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. కానీ ఆ తరువాత మళ్ళీ యదాప్రకారం దానిని మరిచిపోయినట్లు నటించారు. పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీసి అడగడంతో మళ్ళీ సమావేశాల డ్రామాలు మొదలుపెట్టినట్లున్నారు. అయితే ఈవిధంగా డ్రామాలతో ప్రజలని ఇంక ఎంతో కాలం మభ్యపెట్టలేరని తెదేపా, భాజపా నేతలు గ్రహిస్తే మంచిది. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లయితే అప్పుడు మొదట నష్టపోయేది ఆ రెండు పార్టీలేనని గుర్తుంచుకోవాలి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే కాలకుండా ముందే జాగ్రత్త పడితే మంచిది కదా?