ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసును మళ్లీ లేవనెత్తడం పర్యవసానాలపై వైసీపీ అత్యుత్సాహ అంచనాలు వేస్తున్నది. నిజానికి నిన్న రాత్రి కొందరు మిత్రులు నాకు ఫోన్ చేసి చంద్రబాబు అరెస్టవుతారని మెసేజ్‌లు వస్తున్నాయి నిజమేనా అని అడిగారు. అప్పుడే లేనిది ఇప్పుడెలా ఎందుకు అవుతారు? ఎవరు చేస్తారు? ఇక్కడ రాజకీయం ప్రధానం గాని చట్టంలో ఇనుప సూత్రాలేమీ వుండవు. అదే నిజమైతే తన ప్రాణానికి చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరి నుంచి ప్రమాదం వుందని జెరూసలెం మత్తయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించడం సంచలనమై వుండాలి. కాని దానికి వీరెవరూ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు కూడా బిజెపి పెద్దరికంతో టిఆర్ఎస్ టిడిపి సర్దుకున్న తర్వాత తలకిందులయ్యేంత పరిణామాలు వుండబోవు..ఆ పిటిషన్‌పై ఈ ఉత్తర్వు వచ్చిన మాట నిజమే గాని దానిలోని అంశాలను కోర్టు ప్రస్తావించలేదు. 29వ తేదీ నాటికి వచ్చే నివేదిక తర్వాత ఏం చేస్తుందనేది అప్పుడు చూడాలి. ఈ కేసులో నైతికంగా తెలుగుదేశం తప్పు చేసింది. . అందుకు చాలా మూల్యమే చెల్లించింది. ఇప్పుడు ఎసిబి కోర్టు ఇచ్చిన ఆదేశాలలో నివేదిక సమర్పించాలని తప్ప చంద్రబాబుపై చర్య తీసుకోవాలని వున్నట్టు లేదు. ఈ విషయమై ఉదయం చర్చలో రామకృష్ణారెడ్డిని నిర్దిష్టంగా ప్రశ్నించినప్పుడు నా పిటిషన్ ఉద్దేశమే అది కద అని పరోక్షంగా సమాధానం ఇచ్చారు. ఈ కేసు వార్త కవరేజి తెలుగు మీడియాలో విభజనకు అద్దం పట్టింది. ఈనాడు మొదటి పేజీలో ఇవ్వనే లేదు. లోపల మాత్రం సూటిగా శీర్షిక ఇచ్చి తర్వాత సాంకేతికాంశాలతో సరిపెట్టింది. ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇండికేషన్ ఇచ్చింది. నమస్తే తెలంగాణ ప్రముఖంగా ఇచ్చింది. ఇంగ్లీషు పత్రికలు వివరంగానూ ఇచ్చాయి. వీటన్నిటినీ ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు తన వెబ్సైట్లో సమీక్షించారు.బాగానే వుంది . సాక్షి, అంతకు మించి వైసీపీనేతలు ఈ కేసుపై ఎక్కువగా స్పందించినట్టు కనిపిస్తుంది.
వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి కెసిఆర్‌కు చంద్రబాబు 500 కోట్లు ఇచ్చారని ఆరోపించడం మరీ వింతగా వుంది. బహుశా ఆ విషయం తెలుసుగనకే ఇందాక చెప్పిన పాత్రికేయ మిత్రుడు ఈ సంచలన ఆరోపణను తన పోస్టుల్లో పరిగణనలోకి తీసుకోలేదు. ఏమైనా దీనిపై ఎక్కువ అంచనాలు కలిగించి రేపు నిజం కాకపోతే వచ్చే ఎదురుదాడి ఎక్కువగా వుంటుందని వైసీపీ కూడా గుర్తుంచుకోవడం అవసరం. ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అయితే వైసీపీకీ టిఆర్ఎస్కూ చెడినందునే ఈ కేసు వేసినట్టు మరో వాదన చేసింది. రేవంత్ రెడ్డి జలసౌధను ముట్టడించిన రోజునే ఈ వార్త రావడంపై మరికొందరు వ్యాఖ్యలు చేశారు. కోర్టులో కేసు ముందుకు రావడానికి ఈ ఘటనలకూ సంబంధం వుందని చెప్పడం హాస్యాస్పదం. ఉదాహరణకు సెప్టెంబరు29 గడువును తీసుకుంటే అప్పటికి ఎలా వుంటుందో ఎవరు చెప్పగలరు? తమ పరిస్థితి గురించి మాట్లాడకుండా టిడిపి నేతలు జగన్ కేసులను ముందుకు తెచ్చి వాదనలు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ కేసులు సిబిఐ వేగంగా చేసేందుకు కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించవచ్చు. రాష్ట్రంలో అధికారం వుంది గనక నూతన ఆధారాలు సేకరించి అందించి వుండొచ్చు. అలాటిదేమీ జరిగినట్టు కనిపించదు. పైగా తాము ఆ కేసును అలా వాడుకోవడం లేదని చర్చలో పాల్గొన్న ఒక టిడిపి నేత అన్నారు. ఇక బిజెపి కేంద్రం ఉభయ చంద్రుల మధ్య సయోధ్య కుదిర్చిన మాట నిజమేనన్నట్టు బిజెపి ప్రతినిధి చెప్పారు. ఇవన్నీ ఇలాఉటే ఓటుకు నోటు పెద్ద ముందుకు పోతుందని చెప్పలేము.. ఈ రోజు హఠాత్తుగా ఢిల్లీలో ఎపి ప్యాకేజీపై చర్చల హడావుడి కథనాలు మొదలవడం టీవీ ఛానళ్ల దృష్టి మళ్లించే ప్రయత్నం..?