అందాల తార నయనతారకు మీసాలొస్తే.., నిత్యమీనన్ గడ్డాలు పెంచుకొని కనిపిస్తే ఎలా ఉంటుంది? మన మనసుకు అందిన విజువల్స్ భయంకరంగా ఉన్నాయి కదా? మన ఆలోచనే అలా ఉంటే, తెరపై వాళ్లని నిజంగా చూస్తే ఇంకెలా ఉంటుంది? ఈ ఊహ ఓ సినిమాలో సాక్షాత్కరించబోతోంది. అవును.. విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇంకొక్కడు. ఇందులో నయన, నిత్య కథానాయికలుగా నటించారు. ఇదో సైన్స్ ఫిక్షన్. మనుషులు, జంతువులపై చేసే ప్రయోగాల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రతినాయకుడు లవ్ పాత్రలో విక్రమ్ నటించాడు. ఆ పాత్రకు అమ్మాయిలంటే గిట్టదట. తాను చేసే ప్రయోగాల వల్ల.. నిత్యకు, నయనకు గడ్డాలూ మీసాలూ వస్తాయట. ఆ ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా కీలకం అని తెలుస్తుంది.
ఈ విషయమై హీరో విక్రమ్ ఓ క్లూ ఇచ్చారు. ”ఇదో సైన్స్ ఫిక్షన్ తెరపై ఏమైనా జరగొచ్చు. నిత్యమీనన్, నయనతార గడ్డాలూ, మీసాలతో కనిపించినా మీరు ఆశ్చర్యపోవొద్దు. నిజంగా వాళ్లు అలా కనిపిస్తారా, లేదా అనేది మీ ఊహకు వదిలేస్తున్నా. ఈ సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సిందే” అంటున్నారాయన. అఖిల్, లవ్… రెండు పాత్రలూ ఆయనే పోషించారు. అయితే లవ్ పాత్రంటే ఎక్కువ ఇష్టమట. ”లవ్ తక్కువ సేపే కనిపిస్తాడు. కానీ తన ఇంపార్ట్ మాత్రం సినిమా మొత్తం ఉంటుంది. లవ్ ఇచ్చే ఒక్క లుక్ పది భారీ యాక్షన్ సన్నివేశాలతో సమానం.. అదెలా ఉంటుందో సినిమా చూసి తెలుసుకోండి” అని చెప్పుకొచ్చాడు విక్రమ్. ఆయన మాటలు ఎలా ఉన్నా.. నయన, నిత్యల ఆకారాలు తలచుకొంటూనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. మరి థియేటర్లో ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో?