డిల్లీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, భాజపాలకి చెందిన కొమ్ములు తిరిగిన సీనియర్ నేతలని మట్టి గరిపించి తిరుగులేని మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన ఆమాద్మీ పార్టీ, గట్టిగా ఏడాది తిరక్కుండానే మెల్లిగా కూలిపోతోంది. గత ఏడాదిన్నర కాలంలో 15మంది సీనియర్ నేతలు ఆ పార్టీలో నుంచి బయటకి వెళ్ళిపోయారు. వారిలో కొందరు సస్పెన్షన్ వేటుపడి బయటకు వెళ్ళగా మరికొందరు అరవింద్ కేజ్రీవాల్ తీరుని నిరసిస్తూ వెళ్ళిపోయారు. ఇంతవరకు 11మంది ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పోలీస్ కేసులు ఎదుర్కొని అరెస్టయ్యి బెయిల్ పై విడుదల అయ్యారు. మరో ముగ్గురు మంత్రులు వేర్వేరు కారణాల చేత పదవులు కోల్పోయారు. తాజాగా ఆమాద్మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సందీప్ కుమార్ ఒక మహిళతో శృంగారం చేస్తుండగా తీయబడిన వీడియో మీడియా చేతికి చిక్కడంతో అరవింద్ కేజ్రీవాల్ అతనిని కూడా మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి కూడా తొలగించారు.
సందీప్ కుమార్ పై ఆ మహిళా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. రేషన్ కార్డు కోసం వచ్చిన తనకి కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి అత్యాచారం చేసాడని ఆ మహిళా పిర్యాదు చేసింది. ఆ కేసుపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ ఆమె ఆరోపణలు నిజమని తేలితే సందీప్ కుమార్ పై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
ఆమాద్మీ పార్టీ స్థాపించిన ఏడాదిలోనే ఎవరూ ఊహించని విధంగా అధికారంలోకి వచ్చింది. మొదటిసారి స్వీయ తప్పిదం వలననే అరవింద్ కేజ్రీవాల్ అధికారం వదులుకొన్నారు. మళ్ళీ రెండవసారి పోటీ చేసినప్పుడు తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాగలిగారు. కానీ చాలా వేగంగా పార్టీ నేతలని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఈవిధంగా ఏదో ఒక కారణంతో పోగొట్టుకొంటున్నారు. ఆమాద్మీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన వారిలో చాలా మందికి రాజకీయ అనుభవం లేకపోవడం, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నుండి రావడం వంటి అనేక కారణాల వలన సమస్యలలో ఇరుకొంటున్నట్లు తెలుస్తోంది.
నవజ్యోత్ సింగ్ సిద్దూ స్థాపించబోతున్న ‘ఆవాజ్ ఏ పంజాబ్’ పార్టీ వలన పంజాబ్ లో కూడా ఆమాద్మీ పార్టీ వేగంగా తుడిచిపెట్టుకొనిపోతోంది. ఆమాద్మీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు, వారి అనుచరులు సిద్దూ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఆమాద్మీ పార్టీ ఎంత వేగంగా పైకి వచ్చిందో అంతే వేగంగా కూలిపోతుండటం చూస్తుంటే ఆ పార్టీ నిర్వహణలోనే ఏదో లోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా అరవింద్ కేజ్రీవాల్ మేల్కొనకాపోతే ఏదో ఓ రోజు ఆమాద్మీ కనబడకుండా మాయం అయిపోయే ప్రమాదం ఉంది.