తెలంగాణకు చెందిన తెలుగు దేశం పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు త్వరలోనే గవర్నర్ పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోత్కుపల్లికి గవర్నర్ గిరీ ఇవ్వాలని చంద్రబాబు సూచించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆరునెలలు లేదా ఏడాదిలోగా ఆయన గవర్నర్ అవుతారని భావించారు. కానీ రెండేళ్లు దాటినా ఆ ముచ్చట తీరలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం కేంద్రం నర్సింహులు బయోడేటాను తెప్పించుకుంది.
తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పదవీ విరమణ చేయడానికి ఒకటి రెండు రోజుల ముందే కేంద్రం నుంచి వర్తమానం వచ్చినట్టు సమాచారం. మోత్కుపల్లి బయోడేటాను కేంద్రానికి చంద్రబాబు పంపినట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రం తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఈలోగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు తమిళనాడు అదనపు బాధ్యతలు అప్పగించారు. అది కేవలం లాంఛనమే.
మోత్కుపల్లికి తమిళనాడు గవర్నర్ అయ్యే అవకాశం ఉందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రం, అందులోనూ ఓ పెద్ద రాష్ట్రానికి గవర్నర్ కావడం అంటే మోత్కుపల్లిది అదృష్టమే అనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. అయితే గుజరాత్ ముఖ్యమంత్రి పదవినుంచి ఇటీవల వైదొలగిన బీజేపీ నాయకురాలు ఆనందీ బెన్ పటేల్ కూడా తమిళనాడు గవర్నర్ గిరీపై ఆసక్తి చూపుతున్నారట. అయితే కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆమెను గవర్నర్ గా నియమించాలనే ఒక ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉందని వినవస్తోంది. అదే నిజమైతే, తమిళనాడుకు మోత్కుపల్లి గవర్నర్ కావడం ఖాయం కావచ్చు.
ఒకవేళ తమిళనాడు కాకపోతే మరో రాష్ట్రానికి గవర్నర్ గా పంపడమైతే అనుమానం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను బట్టి వీలైతే ఈ నెలలోనే ఆయనకు పదవి దక్కవచ్చని టీడీపీ హైకమాండ్ నుంచి కూడా సంకేతాలు అందాయట. ఆశించిన ప్రకారం పదవి త్వరలోనే దక్కుతుందా లేక ఆనందీ బెన్ వల్ల మరింత ఆలస్యమవుతుందా అన్నదే ఆసక్తికరం.