ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడానికి ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కొన్ని రోజుల క్రితమే తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించారు. అప్పుడే దీని కోసం కాకినాడలో ఈనెల 9వ తేదీన మరో బహిరంగ సభ నిర్వహిస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆ సభకి చాలా చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీన సాయంత్రం 4గంటలకి కాకినాడలో జె.ఎన్.టి.యూ గ్రౌండ్స్ లో నిర్వహించబోయే ఆ సభకి ‘సీమాంద్రుల ఆత్మగౌరవ సభ’ అని పేరు ఖరారు చేసినట్లు జనసేన కోశాధికారిగా వ్యవహరిస్తున్న రాఘవయ్య తెలిపారు.
పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించలేకపోయినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపిలపై, ఆ హామీని నిలబెట్టుకోనందుకు కేంద్రప్రభుత్వంపై చాలా ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఆ తరువాతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కదలిక వచ్చి త్వరలోనే దానిపై నిర్దిష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు తెలిపాయి. అయితే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని దాదాపు స్పష్టం చేశాయి కనుక పవన్ కళ్యాణ్ కాకినాడలో సభ యధాతధంగా నిర్వహించడం కూడా ఖాయమేనని భావించవచ్చు.
ఒకవేళ ఈలోగా ప్రత్యేక హోదాకి బదులు కేంద్రం ప్రత్యేక ప్యాకేజి ఇచ్చినట్లయితే, దానిని రాష్ట్ర ప్రభుత్వం పుచ్చుకొన్నట్లయితే దానిపై కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఆయన తెదేపా-భాజపాలకి మిత్రుడుగా ఉన్నారు కనుక హోదా వచ్చే అవకాశం లేనప్పుడు దానికి బదులు ప్యాకేజి తీసుకొంటేనే మంచిదని ప్రజలకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రత్యేక హోదాయే కావాలని పట్టుబడితే తెదేపా, భాజపాలకి, దానిపై పోరాడేందుకు పేటెంట్ హక్కులు పొందినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్, వైకాపాలకి ఆగ్రహం కలిగవచ్చు.
ఒకవేళ ఈ పోరాటం కారణంగా కాపులకి రిజర్వేషన్ల కోసం ముద్రగడ మొదలుపెట్టబోతున్న ఉద్యమానికి నష్టం కలిగితే ఆయన కూడా పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం మొదలుపెట్టినా, మొదలుపెట్టి మధ్యలో విరమించుకొన్నా సమస్యలు, విమర్శలు తప్పవు.