ప్రత్యేక హోదా విషయంలో అందరి కంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నది ఎవరంటే ఒకప్పుడు పార్లమెంటులో దాని కోసం గట్టిగా పోరాడిన వెంకయ్య నాయుడే. విచిత్రం ఏమిటంటే, సరిగ్గా అదే కారణం చేత అందరూ ఆయనని వేలెత్తి చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేటికీ ప్రత్యేక హోదా ఎవరైనా డిల్లీలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారంటే అది ఆయన మాత్రమేనని చెప్పవచ్చు. కేంద్రమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీలతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని దాని కోసం వారిపై చాలా ఒత్తిడి చేస్తున్నారు. కానీ అందరికీ తెలిసిన కొన్ని సాంకేతిక, రాజకీయ సమస్యలు, అవరోధాలు కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ అందుకు అంగీకరించకపోవడంతో మధ్యలో వెంకయ్య నాయుడు ప్రజలకి, ప్రతిపక్షాలకి దొరికిపోయారు.
ఆయన ప్రత్యేక హోదా సాధించలేకపోయినా రాష్ట్రానికి అనేక ఉన్నత విద్యాసంస్థలని, బెల్, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ వంటి బారీ ప్రాజెక్టులని, సహచర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి వీలైనంత సహాయ సహకారాలు దక్కేలా చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన చేస్తున్న మంచి కంటే, అందరూ ఆయనలో చెడే (ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేకపోవడం) చూస్తున్నారు. ఆయనపై చాలా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు కూడా.
ఆయన నిన్న ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రెండు తెలుగు రాష్ట్రాలకి యధాశక్తిగా నేను సహాయపడుతున్నప్పటికీ, విమర్శిస్తుండటం చాలా బాధ కలిగిస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాలకి సేవ చేసే బాగ్యం దక్కినందుకు చాలా సంతోషిస్తూ నాకు వీలైనంత చేస్తున్నాను. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతింది. కనుక అది మళ్ళీ కోలుకొని తన కాళ్ళ మీద లేచి నిలబడేందుకు అవసరమైన సహాయసహకారాలు అందజేయాలి కనుకనే డానికి సహాయం చేస్తున్నాము తప్ప దానిపై ఎక్కువ ప్రేమ తెలంగాణాపై తక్కువ ప్రేమ ఉందని కాదు.”
“నేను రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎంపికయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అసలు నేను ఎప్పుడూ ఆంధ్రా గురించి మాట్లాడుతాననే కర్నాటకలో నాపై విమర్శలు రావడంతో నేను చివరి నిమిషంలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకి వెళ్ళిపోయాను. రెండు రాష్ట్రాల నుంచి ఎవరు డిల్లీ వచ్చినా నా సహచర కేంద్రమంత్రులని పిలిపించి వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరింఛి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంటాను. ఆ సంగతి రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులకి, ప్రజా ప్రతినిధులు అందరికీ తెలుసు. నాకు రాజకీయాల ద్వారా రెండు రాష్ట్రాలకి సేవ చేయాలనే తపనే తప్ప ఇంకా పదవులు, అధికారం సంపాదించుకోవాలనే తాపత్రయం లేదు నాకు. నేను ఇకపై ఎన్నికలలో పోటీ చేయను. నేను రాజకీయాలలో ఉన్నంత వరకు నా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రాజకీయాలలోకి ప్రవేశించరు,” అని వెంకయ్య నాయుడు చెప్పారు.