కేంద్రం ఆంధ్ర ప్రదేశ్‌కు గొప్ప ప్యాకేజీ బండారం ఏమిటో ప్రభుత్వ లెక్కలలోనే వెల్లడవుతున్నది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ వెళ్లనున్న సందర్భంగా రూపొందించిన వివరాలు అందుకు అద్దం పడుతున్నాయి. రెండు లక్షల కోట్ల ప్యాకేజీ పోలవరం వరం వంటి అతిశయోక్తులు ఆ వివరాలతోనే తేలిపోతున్నాయి.
పోలవరంకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులోనే ఇంకా 1800 కోట్లు ఇవ్వాల్సి వుంది. ఇది ఎప్పుడు ఇచ్చేది మొన్నటి ప్రకటనలో గాని తర్వాత గాని చెప్పింది లేదు. విదేశీ రుణ సహాయం(ఈఎపి) కింద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసుకుంటే ఆ అప్పు తాను చెల్లిస్తానని కేంద్రం చెబుతున్నది. ఈ ప్రకారం మొత్తం 13 ప్రాజెక్టులను 37,770 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 26 వేల కోట్లు అప్పు చేస్తుంది. ఈ మొత్తాన్ని అయిదేళ్లలో ఏటా 5 వేల కోట్ల చొప్పున తీసుకోవాలట. పనులనుబట్టి విడుదలవుతాయి గనక ఒకేసారి 13 ప్రాజెక్టులు ప్రతిపాదించారట. అమరావతికి సంబంధించి 4779 కోట్ల ప్రణాళికలో విదేశీ రుణం 3,324 కోట్లు కాగా ఇందులో 3324 కోట్లు అప్పు. దీంట్లో ప్రపంచ బ్యాంకు నుంచి 60 శాతం అప్పు మాత్రమేతీసుకుంటారట. కారణం దాని వడ్డీ ఎక్కువగా వుంటుందని , మరో 40శాతం ఆసియా ఇన్ప్రాస్ట్రక్చర్బ్యాంక్(ఎఐఐబి) నుంచి తీసుకోవాలని సంకల్పించారు. అయితే ఇదేపత్రికలో మరో కథనంలో ప్రపంచ బ్యాంకు నుంచి 3350 కోట్లు రుణం తీసుకోనున్నట్టు ప్రకటించింది. హడ్కో నుంచి మరో 7500 కోట్ల రుణం. మొత్తంపైన అన్నీ అప్పులే. అవి కూడా చాలా పరిమితంగా వుంటున్నాయి. పోలవరం ఒక్కదానికే 40వేల కోట్ల లెక్క కనిపిస్తుంటే 13 ప్రాజెక్టులకు కలిపి అదికూడా 26 వేల కోట్ల అప్పుమాత్రమే లెక్క చెబుతున్నప్పుడు వరం ఏమిటో అంత ఆనందం దేనికో అర్థం కాదు. ఇది విమర్శించే పత్రికలలో వస్తే మరో విధంగా వుండేదేమో గాని ఈనాడు కథనం గనక- దానిపై ప్రభుత్వానికి ఎలాటి ఫిర్యాదులు లేవు గనక నిజమనే అనుకోవాలి. ఆ లెక్కన చూస్తే పోలవరం పూర్తి రాజధాని నిర్మాణం వంటివి నిజంగా వేగంగా జరిగేందుకు ఈ నిధులు ఏ మూలకు సరిపోయేట్లు? కేంద్రం ఏం బాధ్యత వహిస్తున్నట్టు? ఒకవేళ రాస్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇవన్నీ ఒప్పుకున్నా ఎంత పరిమితంగా ఎంత ఆలస్యంగా జరిగేది అర్థం కావడం లేదా? ప్రపంచ బ్యాంకు వడ్డీ రేటు చాలా ఎక్కువ గనక అనేక రాష్ట్రాలు దానిదగ్గర అప్పు తీసుకోవు. కాని చంద్రబాబు ప్రభుత్వం గతంలోనూ ఇప్పుడూ కూడా దానికి కేరాఫ్ అడ్రస్‌గా బిరుదు సంపాదించుకుంది. ఇప్పుడైనా నిజంగా మారుతుందా? సందేహమే….