పేర్లు ఎందుకులే గానీ మన తోటి పౌరురాలే. నిండు గర్భిణి. నొప్పులు రావడంతో ‘జమునా దేవి మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కొన్ని టెస్టులు చేసిన డాక్టర్స్… గర్భంలో ఉన్న శిశువు మృతి చెందిందని చెప్పారు. ఆ మృత శిశువును బయటకు తీయకపోతే తల్లికి కూడా ప్రమాదమని చెప్పారు. ఆ ఆపరేషన్‌కి ఎంత ఖర్చవుతుందో చెప్పి…ఆ డబ్బులు చెల్లిస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంత డబ్బు తమ దగ్గర లేదని, కొంచెం దయ చూపించమని ఆ గర్భిణికి సంబంధించిన వాళ్ళు డాక్టర్లను బ్రతిమాలుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనదేశంలో ఉన్న ఏ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు అయినా ఏం చెప్తారో…వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇది ధర్మసత్రం కాదు …కార్పొరేట్ హాస్పిటల్, డబ్బులు చెల్లించకపోతే ఆపరేషన్ చెయ్యం అని కరాఖండిగా చెప్పేశారు. మామూలుగా అయితే ఇది మనందరికీ తరచుగా కనిపిస్తూ ఉండే దృశ్యమే. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఓ రెండు గంటలు టైం స్పెండ్ చేసినా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.
అయితే ఇక్కడ ఈ గర్భిణి విషయం జాతీయ వార్త ఎందుకయిందంటే ఆమె చనిపోయింది కాబట్టి. జమునా మెమొరియల్ ఆస్పత్రి వారు ఆపరేషన్‌కి ససేమిరా అనడంతో ఆ గర్భిణి బంధువులు దగ్గరలో ఉన్న సృష్టి అనే మరో ఆస్పత్రికి తీసుకెళ్ళారు. కానీ అప్పటికే ఇన్ఫెక్షన్ సోకడంతో ఆ మహిళ మృతి చెందింది. వెంటనే ఆవేశంగా స్పందించిన ఆమె బంధువులు జమునా మెమొరియల్ ఆస్పత్రి వారే ఆమె మృతికి కారణమని ఆందోళనకు దిగారు. డబ్బు కట్టలేదనే కారణంతో ఆపరేషన్‌కి నిరాకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ డాక్టర్స్‌కి మానవత్వం లేదు, అసలు మనుషులే కాదు, వైద్యో నారాయణో హరి అని అంటారు… కానీ ఈ డాక్టర్లు మాత్రం పశువుల్లా ప్రవర్తించారు లాంటి నాలుగు ఆవేశపూరితమైన డైలాగులను మనమూ మాట్లాడవచ్చు. మీడియా కూడా అదే చేస్తోంది. అయితే నిజాయతీగా సమస్య గురించి ఆలోచిద్దాం. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పని చేసే డాక్టర్స్‌కి భారీగా జీతాలు ఉంటాయి. అలాగే కచ్చితమైన ఆదేశాలు కూడా ఉంటాయి. ‘ఇదేమీ ధర్మ సత్రం కాదు. మీకు లక్షల్లో జీతాలు ఇస్తున్నాం అంటే కారణం మాకు కూడా అదే స్థాయిలో లాభాలు తీసుకువస్తారని…’ అని ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఉద్యోగులకు చాలా స్పష్టంగా చెప్పేస్తుంది అన్న విషయం వాస్తవం. అది కార్పొరేట్ స్కూల్ అయినా, కార్పొరేట్ హాస్పిటల్ అయినా, కార్పొరేట్ స్మశానం అయినా కూడా ఈ రూల్ కామన్. ఇక్కడ వైద్యో నారాయణో హరి, గురుదేవో భవ లాంటి మనకు మనం రొమాంటిసైజ్ చేసేసుకున్న, గొప్ప పదాలతో పెద్దగా పనిలేదేమో. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్, టీచర్స్ కూడా కార్పొరేట్ ఎంప్లాయిస్ అయిపోయారు. వాళ్ళు పనిచేస్తున్న సంస్థకు లాభాలు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత జీవితం సుఖంగా సాగిపోవడానికి అవసరమైన భారీ జీతాలు, సౌకర్యాలు ఇస్తున్న ఉద్యోగాన్ని వదులుకునేంత సాహసం వాళ్ళు ఎందుకు చేస్తారు?
ఇలాంటి విషయాలు వార్తలైనప్పుడు ఆవేశంగా స్పందించేవాళ్ళందరూ కూడా మన పొలిటిషియన్స్లాగా ఇన్స్టెంట్ ఆవేశాలు, ఉద్యమాలను వదిలేసి శాశ్విత పరిష్కారం కోసం ఏమైనా చేస్తే బాగుంటుందేమో. విద్య, వైద్య వృత్తులను వేల కోట్ల రూపాయలను సంపాదించుకోవడానికి మార్గాలుగా మార్చేసిన మన పాలకులను ప్రశ్నిస్తే బాగుంటుందేమో……అధికార మదంతో ఉండే ఆ నాయకులు స్పందించే వరకూ….
ఓట్ల కక్కుర్తి కోసం అన్ని మతాల పండగలకూ కానుకలు, పప్పు బెల్లాలు పంచి పెట్టడం సంక్షేమం కాదు మహానుభావుల్లారా….. కనీస అవసరాలైన విద్య, వైద్యం ప్రజలకు అందించడమే అసలైన సంక్షేమం అని వాళ్ళకు తెలిసివచ్చేవరకూ……..