తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం గురించి అధికార అన్నా డిఎంకె నేతలు ఈ రోజున వ్యక్తం చేస్తున్న ధీమాను బట్టి ఆమె పరిస్తితి కొంచెం మెరుగై వుండచ్చనిపిస్తుంది. ఇది కావాలని చెబుతుండొచ్చు గాని వదంతులలో ఏమాత్రం వాస్తవం వున్నా వారు ఇంతకు సాహసించలేరు, ఈ రోజు బ్రిటన్ నుంచి వచ్చిన వైద్య నిపుణుడు రిచర్డ్ జాన్ బేరీ జయలలితకు అత్యుత్తమ చికిత్స అందుతున్నదని ప్రకటించారు, ఆయన అంత బలంగా అబద్దం చెప్పవలసిన అవసరం వుండదు. ఇక కేంద్ర సహాయమంత్రి బిజెపి నేత రాధాకృష్ణన్ ఆమె ఆరోగ్యంపై వూహాగానాలు చేయొద్దని హితవు పలికారు, రాష్ట్ర మంత్రి జయకుమార్. పార్టీ నేత వరల్మని కూడా ఆమె గురించిన కథలు నమ్మొద్దని కోరారు. ఆమె తీవ్ర పరిస్థితిని ఎదుర్కొన్నా కొంత వరకూ బయిటపడటం వల్లనే వీరంతా ఈ వ్యాఖ్యలు చేసి వుంటారని భావిస్తున్నారు, కావాలని నాటకీయత నిగూఢత పెంచే జయలలిత వ్యూహం కూడా ఆ మేరకు ఫలించినట్టే, ఆమె ఇప్పటికే మరణించారన్న కథనాలు వూహాగానాలేనని తేలిపోతున్నది, బహుశా ఇది కూడా ఆమె గురించిన భవిష్యత్ ప్రచారంలో ముఖ్యపాత్ర వహించవచ్చు.
నిజానికి తమిళనాడులో ఏదీ నాటకీయత లేకుండా జరగదు. గత గురువారం(22వ తేదీ) రాత్రి అపోలో అసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి ఎఐడిఎంకె అధినేత్రి జయలలిత ఆనారోగ్యం ఇప్పుడు అక్కడ రసవత్తర రాజకీయ నాటకంగా మారింది. ఆమె అస్వస్తత ఏమిటి, ఏ స్థితిలో వున్నారు, ఏమి చికిత్సచేస్తున్నారు వంటివన్నీ వూహాగానాలుగానే వున్నాయి. రకరకాల వదంతులు కథనాలు ప్రచారమవుతున్నాయి. అపోలో ఆస్పత్రి వర్గాలు ముక్తసరిగా అమ్మ పరిస్తితి బాగుంది, ఆహారం మామూలుగానే తీసుకున్నారు అంటూ విడుదల చేసిన బులిటెన్లు ప్రజలను సంతృప్తిపర్చకపోవడంతో వదంతులు ఇంకా ప్రబలాయి. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని త్వరలో ఆస్పత్రినుంచి విడుదల అవుతారని ఈ రోజు మరింత వివరంగా ప్రకటన చేశారు. ఈ లోగా కీలకమైన కావేరీ నదీజలాల వివాదంలో జయలలిత తరపున మంత్రి ఇకె పళనిస్వామి ప్రసంగం చదివారు. ఆమె అద్యక్షతన జరిగిన సమావేశంలో నదీజలాల సమస్యను చర్చించినట్టు కూడా ప్రకటన విడుదలైంది.అంతేగాక ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు 476 కోట్ల భృతి కూడా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్నా ఆమె ఫోటోలు విడుదల కాకపోవడం, ఎవరినీ కలుసుకోకపోవడం సందేహాలకు దారితీశాయి.బిజెపి కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ కలుసుకోవాలని వచ్చి 45 నిముషాలు వుండి వెళ్లిపోయారు. ఇక మహారాష్ట్ర నుంచి అదనపు బాద్యతలు చూస్తున్న గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ఇంత వరకూ ఒకసారి కూడా సందర్శించలేదు.కాబట్టి లోలోపల ఏదో జరుగుతున్నదని కథలు వ్యాప్తిలో వున్నాయి.వికటన్పత్రిక అలాటి కథలే ప్రచురించింది.
అవినీతి కేసుల విచారణ సందర్భంగా బెయిల్ పిటిషన్లో జయలలిత తనకు మధుమేశం, రక్తపోటు, శ్వాసపరమైన ఇబ్బందులు వున్నాయని నివేదించారు. ఇప్పుడు కూడా శ్వాస సమస్యతోనే చేరారని చెబుతున్నారు.అదే నిజమైతే ఇన్ని రోజులు వుండదని కొందరు నిపుణులు చెబుతున్నారు. సుప్రీం కోర్టులో ఇదే కేసులో తీర్పు వచ్చేముందే సానుభూతి సంపాదించుకోవడానికి ఇదంతా చేస్తున్నారని మరో కథనం. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల కోసం నాటకం ఆడుతున్నారని మరికొందరు ప్రత్యర్తుల ఆరోపణ. అయితే జయలలిత మొన్ననే ఘన విజయంసాధించి వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించారు గనక అంత అవసరం ఆమెకు ఏమిటని ఎఐడిఎంకె నేతలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.
చతురుడైన ప్రతిపక్ష డిఎంకె నేత కరుణానిధి ఒక ప్రకటన చేస్తూ జయ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే వదంతులను నివారించేందుకై ఆమె చికిత్స ఫోటో విడుదల చేయాలని కోరారు. మరో నేత రామదాస్ కూడా ఇదే కోరారు. అయితే ప్రతిపక్షాలు కావాలనే ఇదంతా వివాదం చేస్తున్నాయని ఎఐడిఎంకె ప్రతినిధి సరస్వతి విమర్శించారు.
ఈలోగా ఆ పార్టీ కార్యకర్తలు పూజలు పురస్కారాలు చేస్తున్నారు. రోజూ ముఖ్యనేతలు ఆస్పత్రి దగ్గర వేచి వుంటున్నారు.
1984 తర్వాత పూర్తిగా అస్వస్తుడై మాట కదలిక కూడా పెద్దగా లేని ఎంజిఆర్ను ముఖ్యమంత్రిగా కూచోబెట్టి పాలన సాగించిన చరిత్ర ఆ పార్టీది. ఇప్పుడు కూడా జయలలిత స్తితిగతులెలా వున్నాయి? ఇదంతా ఎవరు నడిపిస్తున్నారనేది అంతుపట్టడం లేదు. ఆమె పోయెస్ గార్డెన్స్ నివాసం చాలా కాలంగా మందుల మయంగా వుందంటారు. అయితే ఇప్పుడు ఆమెకు ప్రాణాంతక సమస్య వుండకపోవచ్చని ఎక్కువ మంది భావిస్తున్నారు. కాని అధికారికంగా అర్థమయ్యేవరకూ ఉత్కంఠ తప్పదు.