ప్రతిపక్ష వైకాపాను రాజకీయంగా దెబ్బతీయాలన్న వ్యూహంతోనే ఆరేషన్ ఆకర్ష్‌ను తెలుగుదేశం తెరమీదికి తెచ్చింది. వైకాపా ఎమ్మెల్యేలకు వేసిన వలలు వర్కౌట్ అయ్యాయి. ఫిరాయింపుదారులు చాలామంది దేశం పంచకు వచ్చేశారు. వారిలో కొంతమందికి పదవులు కట్టబెట్టే కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. సో… ఈ రకంగా తెలుగుదేశం అనుకున్నది సాధించినట్టే కదా! వైకాపాను రాజకీయంగా బలహీన పరచినట్టే కదా! అయితే, ఇది చాలదన్నట్టుగా… విపక్ష నేత జగన్‌ను మరోసారి జైలుకు వెళ్లాలని ఆ పార్టీ నాయకులు ఎంత తీవ్రంగా కోరుకుంటున్నారో మరోసారి రుజువైంది. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేయీ కృష్ణమూర్తే జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారంటే.. అలాంటి వ్యూహమేదో త్వరలోనే తెలుగుదేశం అమలు చేసేందుకు సిద్ధమౌతున్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతిపక్ష నేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉప ముఖ్యమంత్రి కేయీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా జగన్ జైలుకు వెళ్లడం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్ కు లేదనీ, కోట్లకు కోట్లూ మింగేసి అవినీతిలో కూరుకుపోయిన జగన్ సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఎలా అర్హుడౌతారని కేయీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా జగన్ అడ్డు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో జగన్ ఏమయ్యారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆయన ఎందుకు నోరు మెదపడం లేదని కేయీ నిలదీశారు.
జగన్ చుట్టూ తెలుగుదేశం ఏదో వల పన్నుతోందన్న అనుమానాలు ఈ మధ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, ఇటీవలే జగన్‌తో సహా కొంతమందికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తున్న జగన్‌ను కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే అన్నట్టుగా కేంద్రమంత్రి వెంకయ్య కూడా జగన్‌పై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఈ విమర్శల్లోనూ ‘జగన్.. జైలు’ అనే టాపిక్ నాడు ఆయనా తీసుకొచ్చారు. ఇప్పుడేమో కేయీ కృష్ణమూర్తి మరోసారి ఇదే మాట మాట్లాడుతున్నారు. జగన్‌ను జైలుకు పంపేందుకు తెలుగుదేశం వ్యూహాత్మంగా తెర వెనక ఏదో చేస్తోందన్న చర్చ మరోసారి రాజకీయ వర్గాల్లో జరిగేందుకు ఆస్కారం ఇచ్చేలా కేయీ మాట్లాడారు.