దసరా నాటికి తెలంగాణలో జిల్లాల పునర్విభజన పూర్తి కావాలని కేసీఆర్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ఇందుకోసం అందరినీ మానసికంగా సిద్ధం చేస్తోంది. ఐదు జిల్లాల పార్టీ నేతలతో ఆదివారం కేసీఆర్ జరిపిన భేటీలో కొత్త నిర్ణయాలు జరిగాయి. ఇప్పటికే 27 జిల్లాలకు ముసాయిదా సిద్ధమైంది. మరో మూడు జిల్లాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపైనా అధ్యయనం జరపాలని నిర్ణయించారు.
కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఆందోళన జరుగుతోంది. గద్వాల జిల్లా ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ గట్టిగా పట్టుబడుతున్నారు. వరంగల్ జిల్లాలోని జనగామ పేరుతో జిల్లా కోసం కూడా గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది. కేసీఆర్ తో భేటీలోనూ ఈ డిమాండ్లపై తెరాస నాయకుడు వివరాలనుతెలిపారు. వాస్తవ పరిస్థితిని విడమరచి చెప్పారు.
దీంతో ఈ మూడు జిల్లాల సాధ్యాసాధ్యాలపై ఓ హైపవర్ కమిటీనే వేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సీనియర్ నాయకుడు కె కేశవ రావు నాయకత్వంలో ఏర్పాటయ్యే కమిటీ సభ్యులను సోమవారం ప్రకటిస్తారు. ఈ కమిటీ అన్ని విధాలుగా అధ్యయనం చేసి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా అధికారుల నుంచి కూడా కేసీఆర్ వివరాలను తెప్పించుకుంటారు.
ఈ మూడు జిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని ప్రాథమికంగా అధికారులు తేల్చారు. భౌగోళిక, ఇతర అంశాల ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, తెరాస నేతల అభిప్రాయాల మేరకు ఈ అంశంపై మరోసారి అధ్యయం చేయించాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలపైనా అభ్యంతరాలు, కొత్త ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. దీంతో కొన్ని కొత్త మండలాలకు కూడా ఆమోదముద్ర పడింది. వికారాబాద్ జిల్లాకు అనంతగిరి పేరు పెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. ఇంకా ఈ భేటీలో పలు అంశాలను చర్చించారన తెరాస వర్గాలు తెలిపాయి. మొత్తానికి కేకే కమిటీ ఏ నివేదిక ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కొత్తగా 3 జిల్లాల ఏర్పాటు సాధ్యమేనని తెలిస్తే తెలంగాణలో మొత్తం 30 జిల్లాలు అవుతాయి. అసాధ్యమని నివేదిక ఇస్తే 27 జిల్లాలు ఏర్పాటవుతాయని సమాచారం.