పోసాని ముక్కుసూటి మనిషి. ఏదైనా సరే.. కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడతాడు. పోసాని రాసుకొనే క్యారెక్టర్లే కాదు.. ఆయన స్వభావం కూడా అలానే ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా… అందులో కావల్సినంత మసాలా ఉంటుంది. ఈసారీ అంతే. చాలా చాలా ఘాటైన విషయాలే మాట్లాడాడు. తన రాజకీయ అరంగేట్రం ఓసారి గుర్తు చేసుకొన్నాడు. అప్పట్లో చిరంజీవి తన వైఖరి నచ్చి ప్రజారాజ్యం సీటిచ్చాడని, అయితే డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే ఓడిపోయానని తన నిజాయతీని ఆవిష్కరించుకొన్నాడు. చిరు కూడా నిజాయతీ పరుడని, తన దగ్గర సీటు కోసం ఒక్క పైసా కూడా తీసుకోలేదని చిరుని స్తుతించాడు. అయితే పవన్ గురించి మాత్రం మాట్లాడను అంటూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కారణమేంటయ్యా??? అని అడిగితే ”నేను ఓ వ్యక్తి గురించి మాట్లాడాలంటే నిజాయతీ అయినా ఉండాలి.. లేదంటే చెడ్డోడైనా అయ్యిండాలి” అంటై వెరైటీ సమాధానం ఇచ్చాడు. అంటే పవన్ నిజాయతీ పరుడు కాదనే కదా?
పవన్ హీరోగా గొప్పోడని, కానీ రాజకీయ పరంగా తానేం చేస్తున్నాడో తనకింకా తెలీదని కౌంటరిచ్చాడు. పనిలో పనిగా పాక్ నటుల్ని సమర్థించుకొచ్చిన సల్మాన్‌ని ఉతికి ఆరేశాడు. ”సల్మాన్‌కి అంత విశాల హృదయం ఉంటే… కారు యాక్సిడెంట్ జరిగిన రోజు అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడు” అంటూ సల్మాన్‌ని తీక్షణమైన మాటలతో శంకించాడు. జైలుకెళ్లిన సల్మానా… ఉగ్రవాదం గురించి మాట్లాడడమా, సల్మాన్ కంటే తీవ్రవాది ఇంకొకరు లేరంటూ బాంబు పేల్చాడు పోసాని. కళాకారుల్నీ, దేశభక్తినీ వేరు చేసేంత విశాల దృక్పథం తనకు లేదని, తానైతే పాక్ నటుల్ని బహిష్కరించాలన్న నిర్ణయానికి మద్దతు ఇస్తానని చెప్పుకొచ్చాడు పోసాని.