చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చరణ్ అధికారికంగా ధృవీకరించాడు కూడా. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకుడు . కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, 2017 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చరణ్ ప్రకటించాడు. ఓ పక్క షూటింగ్, మరోవైపు డబ్బింగ్ పనులు జరుగుతున్నాయట. చిరు డబ్బింగ్ చెప్పడం కూడా మొదలెట్టేశాడని చరణ్ చెబుతున్నాడు. అక్టోబరు చివరి నాటికి టాకీ పూర్తి చేసి, నవంబరులో పాటల్ని తెరకెక్కించాలన్నది చిత్రబృందం ఆలోచన.
డిసెంబరు నుంచి ప్రమోషన్ కార్యక్రమాల్ని ఓ రేంజులో చేయాలని చరణ్ భావిస్తున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కీ చిరు కొన్ని కాల్షీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే అటు ఎమ్బీకే, ఇటు 150వ సినిమా అంటూ చిరు ప్రతి క్షణం బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ పాటల్ని సిద్దం చేసేశాడని, అందులో ఐటెమ్ గీతం ఓ రేంజులో వచ్చిందని చెబుతున్నారు. కేథరిన్ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా ప్రతినాయకుడిగా కనిపిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం శ్రియని సంప్రదిస్తున్నట్టు సమాచారం. దసరా కానుకగా.. టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.