కన్నప్ప అనే స్క్రిప్టు రెడీ చేసుకొని తగిన హీరో కోసం రెండుళ్లుగా అన్వేషిస్తున్నాడు తనికెళ్ల భరణి. ఈ సినిమాని సునీల్ చేస్తాడని ముందు చెప్పుకొన్నారు. అయితే.. ఆ తరవాత విష్ణు దగ్గరకు వెళ్లింది. భరణి దర్శకత్వంలో విష్ణు కథానాయకుడిగా ఈసినిమా పట్టాలెక్కబోతోందని చెప్పుకొన్నారు. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని విష్ణు చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి భరణి తప్పుకొన్నాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదు. తాజాగా కన్నప్పలో మరో ట్విస్ట్ వచ్చింది. ఈ సినిమా క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ చేతుల్లోకి వెళ్లినట్టు టాక్.
ఇటీవల కన్నప్ప స్క్రిప్ట్ గురించి తెలుసుకొన్న కృష్ణవంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి ముందుకొచ్చినట్టు టాక్. మరోవైపు విష్ణు కూడా కృష్ణవంశీతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ కాంబినేషన్ దాదాపుగా ఓకే అయిపోయిందని, భరణి ఈసారి రచయిత పాత్రకు మాత్రమే పరిమితం కానున్నడని సమాచారం. కృష్ణవంశీ ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత రైతు సినిమా మొదలవుతుంది. నందమూరి బాలకృష్ణ నటించే 101 వ చిత్రమిది. రైతు పూర్తయ్యాకే కన్నప్ప సెట్స్‌పైకి వెళ్లనున్నదట. సందీప్ కిషన్ సినిమాకీ, రైతు సినిమాకీ మధ్య గ్యాప్ వస్తే మాత్రం అప్పుడు కన్నప్ప ఇంకొంచెం ముందుగానే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.