ఈమధ్య మన హీరోల్లో ప్రొఫెషనలిజం బాగా ఎక్కువైంది. కత్తిలాంటి కథ పడగానే వాడేయడం లేదు. దానికి మరింత పదును పెట్టి రంగంలోకి దిగుతున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అందరికంటే ముందే ఉంటాడు. బన్నీ హార్డ్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. సిక్స్ ప్యాక్ చేయడానికి, సినిమా సినిమాకీ సరికొత్త స్టైల్ చూపించడానికీ బన్నీ రెడీనే. సరైనోడు కోసం కండలు పెంచి.. భారీ సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు డీజే (దువ్వాడ జగన్నాథమ్) కోసం కూడా భారీ కసరత్తులు చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బన్నీ క్యారెక్టర్ రెండు షేడ్స్‌లో సాగుతుంది. దువ్వాడ జగన్నాథమ్ ది ఓ బ్రహ్మణ కుర్రాడి పాత్ర. వంటవాడిగా పనిచేస్తుంటాడట. బ్రహ్మణ కుర్రాడంటే ఆ వేష, భాష వేరేలా ఉంటాయి కదా? డైలాగ్ డెలివరీ కూడా మారాల్సిందే. అందుకే అందుకు ఇప్పుడు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొంటున్నాడు.
ఇద్దరు బ్రహ్మణ కుర్రాళ్లను తీసుకొచ్చి… డైలాగులు వాళ్లతో పలికించి, ఓ పదం ఎలా పలకాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ హైపిచ్లోకి వెళ్లాలి అనే విషయంలో శిక్షణ తీసుకొంటున్నాడట. ఇందుకు గానూ. ఒక్కో మాస్టారుకీ లక్ష రూపాయల చెప్పున పారితోషికం కూడా ఇచ్చినట్టు టాక్. ఇది వరకు రుద్రమదేవిలోని గోన గన్నారెడ్డి పాత్ర కోసం కూడా ఇలానే తెలంగాణ భాష, మాండలికంపై పట్టు సాధించడానికి హోం వర్క్ చేశాడు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.