ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై చిత్ర విచిత్రమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. వైసీపీ అనే రాజకీయ పార్టీ వారి లీలా విన్యాసాలు హద్దులు దాటుతున్నాయి. చివరకు రాజధాని నిర్మాణంపైనే కాకుండా ముఖ్యమంత్రి భద్రతా చర్యలమీద కూడా విమర్శలు చేసే స్థాయికి ప్రతిపక్ష నేతలు ఎదిగిపోయారు.
అసెంబ్లీని రణరంగంగా మార్చడంలో దేశంలోనే నెంబర్ వన్ అనే ఖ్యాతి పొందడానికి వైసీపీ యథాశక్తి ప్రయత్నిస్తోంది. స్పీకర్ అంటే లెక్కలేని తనాన్ని విపక్ష నేత సహా ఆ పార్టీ సభ్యులు సభలో పదే పదే ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికార పక్షం సహనంతో వ్యవహరిస్తున్నా సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు.
తాజాగా వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కార్యాలయాన్ని దసరా మర్నాడు ప్రారంభించారు. తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలనకు అన్ని విధాలుగా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ఇది కూడా వైసీపీ వారికి నచ్చినట్టు లేదు. చంద్రబాబు భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడాన్ని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ రక్షణ ఉంటుంది. అయితే ముప్పు ఎక్కువగా ఉన్న వారికి గ్రెనేడ్ లాంచర్ తో దాడి చేసినా అపాయం కలగని విధంగా ఏర్పాట్లు ఉంటాయి.
వెలగపూడిలో ముఖ్యమంత్రి ఉండే తాత్కాలిక సచివాలయాన్ని రాకెట్ లాంచర్ల దాడిని తట్టుకునేటంత దృఢంగా ఎందుకు నిర్మిస్తున్నారని వైసీపీ నాయకుడు పార్థసారథి ప్రశ్నించారు. అంటే ఏమిటి ఉద్దేశం? చంద్రబాబు నక్సలైట్ల హిట్ లిస్టులో ఉన్నారని అందరికీ తెలుసు. గతంలో ఆయనపై దాడి కూడా జరిగింది. నక్సలైట్లు మందుపాతరను కూడా సరిగ్గా గురి చూసి పేల్చారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ కారు కావడం వల్ల ఎగిరి పల్టీ కొట్టినా ఆయనకు అపాయం కలగలేదు. అప్పటి నుంచీ ఆయనకు కమాండోలతో భద్రత కల్పిస్తున్నారు. ఈ విషయం వైసీపీ వారికి తెలియదని అనుకోవాలా?
సచివాలయ భద్రత విషయంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా తప్పేనా? ఆ మాటకొస్తే వైసీపీ అధ్యక్షుడి నుంచి చాలా మంది నాయకులకు గన్ మెన్లు ఎందుకు? వాళ్లు మంత్రులు కూడా కాదు కదా? అయినా సరే ప్రజా ప్రతినిధులుగా ప్రభుత్వం వాళ్లకు భద్రత కల్పించింది. ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు రాకుండా తీసుకున్న చర్యలను కూడా విమర్శించే స్థాయికి ప్రధాన ప్రతిపక్షం ఎదగడం, బహుశా భారత దేశంలో ఇదే మొదటి సారి కావచ్చు. అసలు రాజధాని నిర్మాణమే ఆపార్టీకి ఇష్టం లేనట్టుంది. పదేళ్లు హైదరాబాదులో ఉండొచ్చు కదా అనేది వాళ్ల ప్రశ్న. ఈలోగా నిర్మాణాలు చేసుకోకపోతే ఆ తర్వాత ఏంచేయాలి? ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని తిట్టేసి అధినేత దగ్గర గొప్పలు చెప్పుకొంటే చాలనుకుంటున్నారేమో వైసీపీ నేతలు. మరి వీళ్ల వైఖరిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారో?