ఫార్ములాని పట్టుకొని వేలాడడంతో టాలీవుడ్ తరవాతే ఎవరైనా. ఓ సినిమా హిట్టయితే చాలు… ఆ కొలతలతో వంద సినిమాలు తీయడానికి రెడీ అయిపోతుంటారు. ఎన్ని ఫ్లాపులు ఎదురైనా సరే, ఫార్ములాలపై నమ్మకం పోదు. హారర్ కామెడీ జోనర్ కూడా టాలీవుడ్‌ని అథః పాతాళానికి తీసుకెళ్లిపోతోందేమో అనిపిస్తోంది. ప్రేమకథా చిత్రం, గీతాంజలి, రాజుగారి గది తప్ప ఈ జోనర్లో వచ్చిన సినిమాలు హిట్టయిన దాఖలాలు లేవు. అయినా సరే.. వాటినే తిప్పి తిప్పి కొట్టడానికి ట్రై చేస్తూ బాక్సాఫీసు ముందు పల్టీలు కొట్టేస్తున్నారు. ఈ జోనర్లో ఎన్ని ఫ్లాపులు ఎదురైనా, `ఇక ఇలాంటి సినిమాలు మేం చూడలేం` అంటూ ఆడియన్స్ తిప్పి కొడుతున్నా.. ఈ జోరు ఆగడం లేదు. తాజాగా హారర్, కామెడీ చిత్రం తన స్థాయి పెంచుకొంటోంది. ఇది వరకు చిన్న సినిమాలకే ఇది పరిమితం. ఇప్పుడు ఓ మోస్తరు బడ్జెట్లో తెరకెక్కే సినిమాలు కూడా హారర్ కామెడీనే నమ్ముకొంటున్నాయి. విచిత్రంగా పెద్ద హీరోలు సైతం దీనికి ఓటేయడం టాలీవుడ్‌ని విస్మయ పరుస్తోంది.
బాలీవుడ్లో ఆత్మకథల జోరు ఎక్కువైంది. ధోనీ సినిమా అక్కడ కోట్లు కొల్లగొట్టింది. మనిషి వ్యక్తిత్వం, వాళ్ల విజయాలు.. వీటిపై బాలీవుడ్ ఆధారపడితే.. మనం మాత్రం `ఆత్మ`లు అంటూ పాత చింతకాయ్ పచ్చడి లాంటి కథల్ని ఎంచుకొంటున్నాం. నమ్మి మోసపోయి చనిపోయిన వ్యక్తి ఆత్మ… ఓ శరీరంలోకి ప్రవేశించడం, అక్కడి నుంచి తన ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం.. పురాణామందిర్ కాలం నాటి కాన్సెప్ట్. అదేంటో.. ఇప్పటికీ అదే మనకు కొత్తగా కనిపిస్తోంది. లేదంటే ఓ ఇంట్లోకి కొత్త జంట ప్రవేశించడం.. అక్కడ ఆల్రెడీ తిష్ట వేసుకొన్న ఆత్మ… కథానాయికని ఆవహించడం, అక్కడ్నుంచి కేకలు, సౌండ్లతో భయపెట్టడం.. ఇదీ వాలకం. ఇంతకు మించి ఆత్మల కథల్లో కొత్తదనం ఏమైనా ఉందా అంటే మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రేమకథా చిత్రం నుంచి మొన్నొచ్చిన అభినేత్రి వరకూ… అన్ని సినిమాలూ ఇదే సూత్రంపై నడిచినవే. కొత్త హీరోలు, చిన్న బడ్జెట్ చిత్రాలూ హారర్ కామెడీ వైపు మొగ్గు చూపించేవి. ఎందుకంటే అది మినిమం బడ్జెట్ లో తీసేసే కథలు. అదృష్టం బాగుంటే.. బడ్జెట్ పరంగా వర్కవుట్ అయిపోయే ఛాన్సులే ఎక్కువ. కాబట్టి చిన్నా చితకా సినిమాలు ఈ కాన్సెప్ట్‌ని నమ్ముకొన్నాయంటే అర్థం చేసుకోవొచ్చు.
అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. టాప్ స్టార్లు కూడా ఈ తరహా కథలపై మోజు పడుతున్నారు. వెంకటేష్ రాజుగారి గది 2లో నటించాలని ఉత్సాహం చూపించాడు. ఆప్రాజెక్టు ఇప్పుడు నాగ్ చేతుల్లోకి వెళ్లిందని టాక్. సూర్య రాక్షసుడు పేరుతో ఓ సినిమా చేశాడు. కార్తి కాష్మోరా కూడా దెయ్యం కథే. అభినేత్రి లో తమన్నాని ఆత్మ ఆహహించింది. అల్లరి నరేష్ కూడా ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ భయపెట్టడానికి రెడీ అయ్యాడు. నారా రోహిత్ కథానాయకుడిగా భీముడు అనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కూడా హారర్ కామెడీ సినిమానే అని తేలింది. మొత్తానికి ఓ మాదిరి హీరోలు కూడా ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై దృష్టి పెడుతున్నారన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. దాంతో హారర్ కామెడీ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. సక్సెస్ రేటు లేకపోయాని ఈ ఫార్ములాని నమ్ముకోవడం సినీ విశ్లేషకులకు సైతం అంతుపట్టని విషయం. ఇన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా.. ఇంకా దెయ్యం కథల్ని నమ్ముకోవడం ఏమిటో అర్థం కావడం లేదు. టాలీవుడ్‌కి పట్టిన ఈ దెయ్యం ఎప్పుడు వదులుతుందో??