ఆగిపోయిన గడియారం కూడా రెండుసార్లు సరైన సమయాన్ని సూచిస్తుందన్నది ఓ సామెత! పాజిటీవ్ దృక్పథానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది? తప్పులోనూ ఒప్పు చూడగల గొప్ప గుణం.. సాధువులకే సాధ్యమేమో? అయితే అనుష్క కూడా తనలో పాజిటీవ్ దృక్పథం బాగా పెరిగిందని చెబుతోంది. తప్పుల్ని చూసే కోణం మారిందని, ఇది సినిమాల్లోకి వచ్చాకే అలవడిన లక్షణమంటోంది అనుష్క. ఏ సినిమా చూసినా.. పాజిటీవ్ దృక్పథంతోనే చూస్తోందట. అలా చూసిన ప్రతీ సినిమా తనకు బాగా నచ్చేస్తుందంటోంది. ”ఓ సినిమా కోసం ఎంత కష్టపడతారో నాకు తెలుసు. చిన్న సన్నివేశం అయినా.. గంటల శ్రమ ఉంటుంది. మనం పైపైన చూసి, బాగుంది, బాగోలేదు అని తేల్చేస్తాం. కానీ… ఆ సినిమా కోసం, ఆ సన్నివేశం కోసం ఎంత కష్టపడ్డారో ఆలోచించం. అందుకే మన కంటికి అన్ని తప్పులుగానే కనిపిస్తాయి” అంటోంది.
అనుష్క జీవితంలో బాగా కష్టపడి పనిచేసిన సినిమా ఏమిటి?? ఇదే ఆమెని అడిగితే… ‘వర్ణ’ అంటోంది. ”వర్ణ కోసం నిజంగా మేమంతా కష్టపడ్డాం. నెల రోజుల పాటు ఎలాంటి సౌకర్యాలూ లేని మారు మూల ప్రాంతంలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో కనీసం బాత్ రూమ్ సదుపాయాలూ లేవు. చలితో చాలా సమస్యలు ఎదురయ్యాయి. సరైన ఆహారం కూడా దిరికేది కాదు. అంత కష్టపడినా… ఆసినిమా ఆడలేదు. కానీ.. నాకు మాత్రం గొప్ప అనుభవం నేర్పింది. కష్టపడిన ప్రతీసారీ ఫలితం రావడం సినిమా పరిశ్రమలో కుదరని విషయం. మేం పడిన కష్టం ఫలించి ఉంటే.. ఆ సినిమా చాలా గొప్ప విజయాన్ని సాధించేది. కానీ ఆ సినిమా నన్ను మా టీమ్నీ మోసం చేసింది” అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది అనుష్క.