తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడులను సాధించడానికి ఆయన మరో ప్రయత్నం చేస్తున్నారు. తొలిరోజు ఆయన పలువురితో భేటీ అయ్యారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ ను కేటీఆర్ కలుసుకున్నారు. తన ప్రయత్నానికి సహకరించాలని కోరారు. అమెరికా పారిశ్రామిక వేత్తలను తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించడంలో సహాయం చేయాలని కోరారు.
హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. అమెరికాలో ఉన్న తెలంగాణ విద్యార్థుల సమస్యల గురించి చర్చించారు. తొలిరోజు పర్యటనలో కేటీఆర్ బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మార్క్ ఆలెన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎయిరో స్పేస్ సిటీలో బోయింగ్ సంస్థ పెట్టుబడులు పెట్టింది. అక్కడ తమకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారంపై ఆ సంస్థ సంతృప్తి ప్రకటించింది.
కేటీఆర్ వారం రోజుల పర్యటనలో పలు నగరాల్లోపర్యటిస్తారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు ఫిక్స్ అయ్యాయి. చాలా తక్కువ వ్యవధిలో ఆయన మరోసారి అమెరికా పర్యటన చేపట్టారు. మే, జూన్ లో రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించారు. అప్పుడు పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
ఇప్పటికే ఒక బ్రాండ్ఇమేజ్ ఉన్న హైదరాబాద్ కు వీలైనన్ని పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా తెరాస ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, ఏపీ ప్రభుత్వం కూడా పెట్టుబడుల వేటలో బిజీగా ఉంది. వచ్చేనెలలో చంద్రబాబు అమెరికాలో పర్యటించబోతున్నారు. తెలుగు వారు రాష్ట్రాలుగా వేరైనా అభివృద్ధిలో పోటీ పడాలనే స్ఫూర్తి ఈ విధంగా కనిపిస్తోంది.