ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుభార్యత్వం గురించి మాట్లాడారోగానీ, చుట్టూ తిరిగి అది తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకున్నట్టుగా ఉంది! వెలగపూడిలోని సీఎం ఆఫీస్ ప్రారంభించాక చంద్రబాబు నాయుడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ టాపిక్ మాట్లాడిన సంగతి తెలిసిందే! కుటుంబ విలువల గురించి ఆయన ఏం చెప్పారంటే… ఇండియాలో ఉన్న విలువ ప్రపంచదేశాల్లో ఎక్కడా లేవన్నారు. అమెరికాలో ఎన్నెన్ని పెళ్లి చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నామనీ, ట్రంప్‌కు ఇప్పుడున్నావిడ నాలుగో భార్య అనుకుంటా అని వ్యాఖ్యానించారు. అన్నేసి పెళ్లిళ్లు చేసుకుంటే తాత్కాలిక ఆనందం మాత్రమే ఉంటుందని కూడా అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల తరువాత అందరూ పవన్ కల్యాణ్ వైపు చూశారు! ఎందుకంటే, ఆయన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు ఇలా మాట్లాడి ఉంటారని విశ్లేషణలు చేసేశారు. అనూహ్యంగా ఈ బహుభార్యత్వం చర్చ తెలుగుదేశం నాయకుల దగ్గరకే వచ్చి ఆగుతోంది!
ఎక్కడో అమెరికాలో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కి నలుగురు భార్యలు అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారనీ, ఆయన పక్కనే ఉంటున్న ఇద్దరు కీలక నేతల గురించి మరచిపోయారా అంటూ వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు! తెలుగుదేశంలో ఇద్దరు నాయకులకు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారని, వారెవరో చంద్రబాబు తెలియకుండా ఎలా ఉంటుందని ఓ చర్చ కార్యక్రమంలో ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణకు కాస్త బలం చేకూర్చేలా ప్రముఖ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు కూడా మాట్లాడటం గమనార్హం! ఒకరిద్దరు నాయకులు బహుభార్యత్వంతో ఉన్న మాట వాస్తవే అనీ, అలాంటి విషయాలు బయటకి వస్తే పరువు సమస్య వస్తుంది కాబట్టి, వీలైనంత వరకూ తెరచాటుగానే ఉంటాయన్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ అంశాలపై వైకాపా చేసిన ఆరోపణల్ని లైట్‌గా తీసుకోవచ్చు. కానీ, ఇద్దరు నాయకులు ఒకటికంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారనే ఆరోపణ చిన్నది కాదుకదా. ఇప్పుడు చర్చ ఏంటంటే.. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు..? నిజంగానే రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారా..? ఒకవేళ అదే నిజమైతే ట్రంప్ పేరుతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వారిని ఉద్దేశించినవా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తావిచ్చే విధంగా ఈ వ్యవహారం మారుతోంది. ఇంకో సమస్య ఏంటంటే… ఈ విమర్శల్ని తిప్పి కొట్టడానికి తెలుగుదేశం నేతలు ఎవరు స్పందిస్తారు అనేది! ఎవరు మాట్లాడినా వారినే అనుమానంగా చూస్తారేమో అనే భయం అందరిలోనూ ఉంటుంది కదా!