అమరావతి స్టార్టప్ క్యాపిటల్ నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిని సవాలు చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు మార్చింది. రాజధాని భవనాల నిర్మాణం, అభివృద్ధి మాత్రమే గాక ఉద్యోగాల కల్పన, కమర్షియల్ స్పేస్ మార్కెటింగ్ ముఖ్యమని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. ‘మాకు పరుగెత్తే గుర్రాలే కావాలి, గాడిదలు వద్దు ‘ అని నోరు పారేసుకున్నారు. దీనిపై గతంలో సింగిల్ జడ్జి ఎస్.రామచంద్రరావు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా మళ్లీ హైకోర్టులోనే తేల్చుకోమని వారు ఆదేశించిన మీదట తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, యు.దుర్గాప్రసాదరావుల ద్విసభ్య బెంచి విచారణ జరుపుతున్నది. ఎజిశ్రీనివాస్ గుర్రాలు గాడిదలు అన్నప్పుడు జస్టిస్ దుర్గాప్రసాదరావు నవ్వుతూ చురక వేశారు.గాడిదలే బాగా పనిచేస్తాయి,పైగా కష్టపడిపనిచేస్తాయి.బరువులు మోస్తాయి అన్నారు. అప్పటికి మార్పులేని ఎజి అయినా సరే గుర్రాలే కావాలి గాని గాడిదలు వద్దని అన్నారు. దేశీయ సంస్థలకు అవకాశం ఇవ్వడం గురించి లోగడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావన వచ్చినపుడు ‘ మన వాళ్లు కట్టేవి మురికివాడల్లా వుంటాయని తీసిపారేయడం విమర్శలకు దారి తీసింది. అయితే ఇప్పుడు ఎజి మరో అడుగు ముందుకేసి వాటిని ఏకంగా గాడిదలతో పోల్చారు. మన దేశ సంస్థలు ఈ స్సేస్ మార్కెటింగ్ చేయలేవని శ్రీనివాస్ చెప్పినప్పుడు మరి హైదరాబాదులో ఐటి కంపెనీల విస్తరణకు దేశీయ సంస్థలే కారణం కదా అని కోర్టు ప్రశ్న వేసింది.
తమాషా ఏమంటే రాజధాని నిర్మాణ కాంట్రాక్టరు ఎంపికకు సంబంధించిన టెండరు నిబంధనల్లో ఉపాధి కల్పన అన్నఅంశమే లేదట. అదిత్య తరపు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి దీనిపై సోదాహరణంగా వాదించారు. అదే షరతు అయ్యేట్టయితే రేపు సింగపూర్ కన్సార్టియం విదేశీపెట్లుబడులను ఆకర్షించడంలో విఫలమైతే ఎలాటి చర్యలుంటాయో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. వాస్తవానికి టెండరు నిబంధనల్లో ఆదాయం ప్రధానంగా పొందుపర్చిన ప్రభుత్వం ఇప్పుడు ఉపాధి కల్పన ముఖ్యమని మాట మారుస్తున్నదని వివరించారు. సింగపూర్ కన్సార్టియంకు ఎంత ఇస్తున్నారో చెప్పకుండా అంతకంటే ఎక్కువ ఇచ్చేవారినే అనుమతిస్తామని చెప్పడం స్విస్ చాలెంజి ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆ వివరాల కోసం తాము లేఖ రాస్తే క్రిడా అధికారులు తిరస్కరించారని గుర్తు చేశారు. విదేశీ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగించడం చట్టం ముందు నిలవదనీ, దేశీయ సంస్థలకు అవకాశం లేకుండా వుండేట్టుగా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు. సోమవారం కూడా కేసు విచారణ కొనసాగనుంది.