కాపుల రిజర్వేషన్ల విషయం మరోసారి చర్చనీయం కాబోతోంది. ఎందుకంటే, ఇదే విషయమై ఉద్యమించేందుకు మరోసారి కార్యాచరణ సిద్ధం చేశారు కాపు సంఘాల నేత ముద్రగడ పద్మనాభం. నవంబర్ 16 నుంచి ఐదురోజులపాటు ఉద్యమించబోతున్నట్టు ప్రకటన చేశారు.ఈసారిసత్యాగ్రహ పాదయాత్ర చేయబోతున్నట్టు ముద్రగడ వివరించారు. రావులపాలెంలో మొదలుకానున్న ఈ పాదయాత్ర అంతర్వేది వద్ద ముగుస్తుందని చెప్పారు.
కాపుల రిజర్వేషన్ల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదన్నారు. ఈ విషయమై ఏదో ఒక ప్రకటన చేస్తామంటూ సర్కారు ఇచ్చిన గడువు ఆగస్టుతోనే ముగిసిందని, అయినా ఎలాంటి స్పందనా లేదన్నారు. అందుకే మరోసారి ఉద్యమించాల్సి వస్తోందని ముద్రగడ అభిప్రాయపడ్డారు. కాపు జాతి కోసం తన ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. పాదయాత్ర విషయంలో వెనకడుగు వేసేది లేదని, తనతో ఒక్కరు వచ్చినా, పదిమంది కదిలినా ఈ యాత్ర జరుగుతుందన్నారు. తన యాత్రలో పాలుపంచుకునేందుకు ఎవరు వచ్చినా సంతోషమే అని ఆయన అన్నారు.
కాపుల రిజర్వేషన్ల ఉద్యమం ఇకపై దశలవారీగా ఉండబోతోందని సమాచారం. ఈ మధ్యనే ఉద్యమ నేతలు ఈ మేరకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది! హైదరాబాద్‌లో ఇదే విషయమై ఓ హోటల్లో చర్చలు జరుపుతుండగా… ఆ వివరాలను తెలుసుకునేందుకు చంద్రబాబు సర్కారు తమపై నిఘా వేయించందని ముద్రగడ ఆరోపించారు. ఆ హోటల్లో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్‌ను కూడా సర్కారు తీసుకెళ్లిందని గతంలో అన్నారు. ఉద్యమాన్ని అన్ని జిల్లాలకూ విస్తరింపజేసేలా కార్యాచరణ ప్రణాళిక ఉన్నట్టు సమాచారం. ముద్రగడ నిరాహార దీక్షలకు దిగితే, నేతలందరూ ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం అవుతున్నారనీ, అందుకే భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ కలిపేదిగా ఉండాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఇప్పుడు సత్యాగ్రహ పాదయాత్రను చేస్తున్నట్టు చెప్పుకోవాలి.
గతంలో ముద్రగడ ఎప్పుడు ఉద్యమించినా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటూ వచ్చాయి. మరి, ఈసారి ఎలాంటి పరిణామాలకు చోటుచేసుకుంటాయో, తాజా ఉద్యమ నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ల గురించి మరోసారి ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.