తెలుగు సినిమాకి పెద్ద దిక్కు… దాసరి నారాయణరావు. ఆయన ఏం మాట్లాడినా ఓ అర్థం పరమార్థం ఉంటుంది. ప్రతీ మాట వెనుక, ఆఖరికి ఆయన మౌనం వెనుక కూడా బలమైన కారణం ఉంటుంది. ఏ మాటా ఉత్తినే నోరు జారరు. ఈరోజు ఓ ఆడియో ఫంక్షన్లో చిన్న సినిమాల దుస్థితి గురించి మాట్లాడుతూ.. సడన్‌గా ఆయన ప్రసంగం బాహుబలి వైపుకు మళ్లింది. పేపర్లు, టీవీలూ చిన్న సినిమాల గురించి పట్టించుకోవని, అవే పెద్ద సినిమాలకు ఫ్రీగా ప్రచారం చేసి పెడతాయన్నారాయన. ఆ సమయంలోనే బాహుబలి ప్రస్తావన వచ్చింది. ”బాహుబలికి రాజమౌళి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. పేపర్ కీ టీవీలకూ ఒక్క యాడ్ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమాలు మాత్రం తన బడ్జెట్‌కి రెట్టింపు ప్రచారం కోసం ఖర్చు పెట్టాల్సివస్తోంది” అంటూ ఆవేశపడ్డారాయన.
బాహుబలి కోసం రాజమౌళి ఖర్చు పెట్టకపోవడం ఏమిటి?? రెండొందల కోట్ల సినిమా అది. ఆ స్థాయిలో ఓ సినిమా తీస్తున్నారంటే, బాలీవుడ్‌కి ధీటుగా ఓ తెలుగు సినిమా తయారవుతోందంటే.. కచ్చితంగా మీడియా కూడా భుజాన మోస్తుంది. కావల్సినంత పబ్లిసిటీ ఫ్రీగా చేసి పెడుతుంది. అది… ధర్మం. చిన్న సినిమా అయినా సరే.. అందులో విషయం ఉందీ అంటే.. ఎన్నిసార్లు భీకరమైన ప్రచారం చేసి పెట్టలేదు..?? సినిమాపై బతుకుతున్న టీవీ ఛానళ్లు.. శాటిలైట్ ఎందుకు కొనరు? అన్నది దాసరి ప్రశ్న. ఆయన ఆవేశాన్ని, చిన్న సినిమాల బాధనీ అర్థం చేసుకోవాల్సిందే. కానీ ఛానళ్ల మాట వేరు. యేడాదికి 150 సినిమాలు విడుదలైతే.. అందులో సత్తా ఉన్నవి పదో.. ఇరవయ్యో. స్టార్ డమ్నో, క్రేజ్నో చూసుకొని మరి కొన్ని సినిమాల్ని ముందే కొనేస్తారు. మిగిలిన సినిమాలకు శాటిలైట్ అవ్వదు. కేవలం శాటిలైట్ హక్కులొస్తే చాలు, సొమ్ము చేసుకొందాం అనుకొని సినిమాలు తీసే బాపతు ఆ 150లో కనీసం 50 ఉంటాయి. అలాంటి చౌకబారు సినిమాల్ని కొనుక్కోవడం వల్ల ఛానళ్లకు ఉపయోగం ఏముంది? ఇంత చిన్న లాజిక్‌ని దాసరి గారు ఎలా మర్చిపోయారో అర్థం కాదు.
బాహుబలికి మీడియా ఫ్రీగా ప్రచారం చేసిపెట్టిందన్న అపవాదు కేవలం దాసరి నుంచే రాలేదు. ఇండ్రస్ట్రీలో చాలామంది పెద్దలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతల ఆక్రోశమే ఇది. బాహుబలి స్థాయిలోనే తెలివిగా ప్రచారం చేసుకొందామని భంగపడిన సినిమాలూ ఉన్నాయి. వాటికీ బాహుబలికీ ఉన్న తేడా ఒక్కటే… రాజమౌళి. ఆయన బిజినెస్ మైండ్ తిరుగు లేనిది. బాహుబలి గురించి మాట్లాడుకోకపోవడం, బాహుబలి గురించి రాయకపోవడం, బాహుబలి గురించి చెప్పకపోవడం తప్పేమో అన్నంత హైప్ క్రయేట్ చేసిన ఆయన బుర్రకు జోహార్లు చెప్పుకోవాలి. అంతోటి తెలివితేటలు వాడడం తెలియాలే గానీ.. ఏ సినిమాకైనా బాహుబలి స్థాయి ప్రచారం రావడం.. తథ్యం. బాహుబలి ఫ్రీ పబ్లిసిటీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్‌ని దాసరి లాంటివాళ్లు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.