150వ సినిమాల చరిత్ర దాసరి నారాయణరావుది. ఆయన ముట్టుకోని కథ లేదు. కలసి పని చేయని స్టార్ లేడు. స్టార్‌తో పని చేయడం కంటే.. స్టార్లని తయారు చేయడం అంటేనే ఆయనకు ఇష్టం. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌నీ, ఇప్పుడున్న మార్కెట్‌నీ పట్టుకోవడం దాసరి లాంటి సీరియర్లకు సాధ్యం కావడం లేదు. పరమవీరచక్ర పరాజయమే అందుకు తార్కాణం. భారీ అంచనాలతో వచ్చిన దాసరి 150వ సినిమా ఇది. బాలకృష్ణ కెరీర్లోనే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ తరవాత వచ్చిన ఎర్రబస్సు కూడా ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అప్పట్నుంచి దాసరి మెగా ఫోన్ జోలికి వెళ్లలేదు. మధ్యలో ఏవో కొన్ని ప్రాజెక్టులు అనుకొన్నా అవి కార్యరూపం దాల్చలేదు. బొగ్గు కుంభకోణం మకిలి అంటుకోవడం, కోర్టు కేసులు, అనారోగ్యంతో.. దాసరి విరామం తీసుకొన్నారు. అయితే.. ఇప్పుడాయన మళ్లీ రంగంలోకి దిగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈసారి.. ఓకేసారి మూడు సినిమాల్ని పట్టాలెక్కించబోతున్నారు. అందులో రెండు సినిమాలు వేరే దర్శకుల చేతిలో పెడదామన్నది దాసరి ఆలోచన. ఒక సినిమాకి తానే దర్శకత్వం వహిస్తూ.. నటిస్తారు. ఈ చిత్రానికి ‘పితృదేవోభవ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్ర్కిప్టు వర్క్ కూడా పూర్తయ్యింది. త్వరలో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఆ వెంటనే నిరవధికంగా షూటింగ్ జరగబోతోంది. పవన్ తో చేయబోయే సినిమా విషయాల్లో కూడా అతి త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ”ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. బౌండెడ్ స్క్రిప్ట్ లు సిద్దమయ్యాకే… ఆయా సినిమాల్ని పట్టా లెక్కిద్దామనుకొంటున్నా..” అన్నారు దాసరి. సో.. దర్శకరత్న మళ్లీ బిజీ బిజీ అన్నమాట.