ఓ సినిమాకి తొలి రోజే హిట్ టాక్ రావడం వరం. యునానిమస్ గా `బాగుంది` అని పేరు తెచ్చుకోవడం గొప్ప అదృష్టం. ఓ సినిమా ఆడియన్స్‌కి నచ్చితే…. విమర్శకులు విరుచుకుపడతారు. ఇంకోటి విమర్శకులకు నచ్చుతుంది… థియేటర్లో జనాలు ఉండరు. ఇంకొన్ని ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే సినిమాలుంటాయి. అందరికీ నచ్చేసింది అనుకొన్న సినిమా ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ప్రేమమ్ విషయంలో అదే జరిగింది. దసరా బరిలో నిలిచిన ఈ సినిమాకి గొప్ప రివ్యూలొచ్చాయి. మలయాళ ప్రేమమ్ కంటే ఎందులోనూ తీసిపోదు… అంటూ సమీక్షకులు ఎత్తేశారీ సినిమాని. తొలి రోజు టాక్ చూస్తే.. ఈ సినిమా బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమనుకొన్నారు. తీరా చూస్తే బొటాబొటీగా బ్రేక్ ఈవెన్ వరకూ వెళ్లగలిగింది. నిజానికి ఈసినిమాకి వచ్చిన టాక్‌కీ, ఇప్పుడు సాధించిన వసూళ్లకు ఏమాత్రం సంబంధం లేదు. తొలిరోజు టాక్‌తో పోలిస్తే.. కచ్చితంగా ఐదారు కోట్లు వెనకబడింది. కనీసం పాతిక కోట్లు సాధిస్తుందనుకొంటే… రూ.20 కోట్లకు దరిదాపుల్లో కూడా చైతూ సినిమా రాలేకపోయింది.
దసరా సీజన్లో మిగిలిన ఏ సినిమాకీ రానన్ని వసూళ్లు ప్రేమమ్‌కి దక్కాయి. అది కాదనలేని విషయమే. కానీ.. ఆశించినంత స్థాయిలో ప్రేమమ్ కలక్షన్లు రాబట్టుకోలేకపోవడం నిర్మాతల్ని, ఇటు ట్రేడ్ వర్గాల్నీ విస్మయ పరుస్తున్నాయి. దసరాకి ప్రేమమ్‌తో పాటు విడుదలైన జాగ్వార్, ఈడు గోల్డెహె, అభినేత్రి సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. కనీసం వీటిలో ఒక్క సినిమా అయినా పోటీ ఇచ్చినా… ప్రేమమ్‌కి వసూళ్లు తగ్గాయనుకోవడంలో ఓ అర్థం ఉంటుంది. కానీ.. ఇవేం ప్రేమమ్ పక్కన నిలబడలేదు. అటు రివ్యూల పరంగా, ఇటు టాక్ పరంగా కూడా. అలాంటప్పుడు కూడా ప్రేమమ్ రూ.20 కోట్లు దాటకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. చైతూ క్రౌడ్ పుల్లర్ హీరో కాదు. సినిమా బాగుంటే చూస్తారంతే. బీ,సీల్లో నాగచైతన్యకు ఉన్న క్రేజ్ ఏంటో..ప్రేమమ్ మరో సారిచెప్పింది. అక్కడ చైతూ ఓ మోస్తరు హీరో మాత్రమే. దసరాకి ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందనుకొన్నారంతా. కానీ.. వాళ్లెవ్వరూ ఇంట్లోంచి కదల్లేదు. ఆ ప్రభావం కూడా ప్రేమమ్ వసూళ్లపై పడింది.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమమ్ కి హిట్ టాక్ రాగానే చిత్రబృందం రిలాక్స్ అయిపోయింది. పబ్లిసిటీ గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. సినిమా హిట్ అయినప్పుడు.. పబ్లిసిటీపై ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది. ఆ ఎఫెక్ట్ కూడా ప్రేమమ్పై పడింది. చిన్నా చితకా సినిమాలు, డబ్బింగ్ సినిమాలూ… ఈమధ్య రూ.15 కోట్లు ఈజీగా అందుకొంటున్నాయి. సూపర్ టాక్ వచ్చాక కూడా.. చైతూ ఆ అంకెని దాటుకోవడానికి ఇన్ని రోజులు ఆగాల్సివచ్చింది. దేవుడు వరమిచ్చినా .. పూజారి కరుణించకపోవడం అంటే ఇదేనేమో?