గత రెండు మూడేళ్లుగా.. కల్యాణ్ రామ్ – ఎన్టీఆర్‌ల మధ్య అన్నదమ్ముల బంధం మరింత ధృడంగా సాగుతోంది. కల్యాణ్ రామ్ ఫంక్షన్లో ఎవరు ఉన్నా లేకున్నా ఎన్టీఆర్ ఉండాల్సిందే. ఎన్టీఆర్ ఆడియో వేడుక అంటే కల్యాణ్ రామ్ తప్పని సరి. ఒకరి విజయాల్ని మరొకరు మనసారా ఆస్వాదిస్తున్నారు కూడా. ఆ అనుబంధంతోనే.. కల్యాణ్ రామ్ సినిమాకి ఎన్టీఆర్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌లో టాక్స్ వినిపిస్తున్నాయి. ‘కిక్ 2’ సినిమా సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కల్యాణ్ రామ్‌ని ఒడ్డున పడేసింది కూడా ఎన్టీఆరే అని చెప్పుకొన్నారు. ఇప్పుడు ‘ఇజం’కీ అలాంటి ప్రచారమే జరుగుతోంది. ఈసినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నాడని చెప్పుకొన్నారు. ఆ తరవాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ ముందుకొచ్చాడని అన్నారు. అవేం లేవట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రస్తావన గానీ. ఎన్టీఆర్ భాగస్వామ్యం కానీ ఉండవని క్లియర్ కట్‌గా తెలిసిపోయాయి.
‘ఇజం’ బిజినెస్ లో ఎన్టీఆర్ చొరవ తీసుకొన్నాడని, ‘జనతా గ్యారేజ్’ బయ్యర్లను పిలిచి.. ‘ఇజం’ సినిమాని తక్కువ రేటుకే ఇచ్చేశాడని బయట చెప్పుకొంటున్నారు. అయితే వాటిలో కూడా వాస్తవం లేదని తేలింది. `ఇజం` బిజినెస్‌లో ఎన్టీఆర్ ఏమాత్రం కలగచేసుకోలేదని చెబుతున్నారు నందమూరి కాంపౌండ్ వర్గాలు. ఈ సినిమా ప్రచారంలో ఎన్టీఆర్‌ని వాడుకోవాలని కల్యాణ్‌రామ్ భావించినా చివరికి ఆ ప్రతిపాదన విరమించుకొన్నాడట. ఎన్టీఆర్ – కల్యాణ్ రామ్ – పూరిలతో ఓ ఇంటర్వ్యూ చేయించి మీడియాకు ఇవ్వాలని భావించారు. అయితే… చివరి క్షణాల్లో అది కూడా వద్దని డిసైడ్ అయినట్టు టాక్. సో.. ఇజంకి సంబంధించినంత వరకూ అన్ని కష్టాలూ సోలోగా కల్యాణ్‌రామే పడుతున్నాడన్నమాట. ఈ విషయంలో ఎన్టీఆర్ హెల్ప్ ఏమీ లేదన్నమాట.