బడా హీరోల సినిమాలు ఇప్పుడు రీషూట్లు జరుపుకోవడం సర్వసాధారణమైపోయింది. సినిమా అంతా ఐపోయాక.. మార్పులూ, చేర్పుల కోసం రంగంలోకి దిగడం, కొన్ని సీన్లు కత్తిరించడం, ఇంకొన్ని యాడింగులు చేయడంతో రీషూట్లు తప్పడం లేదు. ఈమధ్య స్టార్ హీరో సినిమా అంటే… రీషూట్ చేయడం మామూలే అయిపోయింది. దాన్ని స్టార్లూ సమర్థించుకొంటున్నారు. `రీషూట్ చేస్తున్నామంటే మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నట్టే కదా?` అంటున్నారు. పెద్ద హీరోల సినిమా అంటే కోట్లతో వ్యాపారం. రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. అయితే.. ఈమధ్య చిన్న సినిమాలూ రీషూట్లకు సై అంటున్నాయి. తాజాగా సంపూర్ణేష్ బాబు సినిమా కూడా రీషూట్‌కి దిగడం.. ఆశ్చర్యపరుస్తోంది.
హృదయకాలేయంతో.. ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేశాడు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమాతో నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయ్యింది. ఆ సమయంలోనే కొబ్బరిమట్ట అనే సినిమా కూడా ఎనౌన్స్ చేశారు. హృదయకాలేయం జోరుతో ఆ సినిమా షూటింగ్ కూడా చకచక ముగించారు. ఆమధ్యె ఎప్పుడో పెదరాయుడు టైపులో ఓ డైలాగ్‌ని కట్ చేసి వదిలారు. కానీ విడుదల ఎప్పుడనేది ప్రకటించలేదు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా రీషూట్ జరుపుకొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు రీషూట్ ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ విడుదలయ్యాక… ఈ సినిమాకి కాస్తో కూస్తో బిజినెస్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాని చూసిన ఓ బడా నిర్మాత సినిమా మొత్తాన్ని హోల్ సేల్‌గా కొనేయడానికి ముందుకొచ్చాడట. అయితే ఆయన సూచనల మేరకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పైగా ఈ సినిమా ప్రొడక్షన్ అంతా మారుతి కను సన్నల్లో నడుస్తోంది. మారుతి ప్రమేయంతో ఈ సినిమాలో కొన్ని సీన్లు వచ్చిపడ్డాయని వాటిని రీషూట్ చేస్తున్నారని తెలుస్తోంది. సంపూ బాబు సినిమాలకే రీషూట్లు జరిపి, జాగ్రత్త పడిపోతుంటే.. పెద్ద హీరోలు తీసిన సినిమానే మళ్లీ తీసుకోవడంలో తప్పేముంది?