పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ల మధ్య విబేధాలొచ్చాయని, వీరి కాంబినేషన్లో రాబోయే హ్యాట్రిక్ సినిమా ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి. పవన్‌తో డ్రాప్ అవ్వడం వల్ల త్రివిక్రమ్ మరో హీరో అన్వేషణలో పడ్డాడని, అందుకే ఎన్టీఆర్‌కి లైన్ క్లియర్ అయ్యిందన్న వార్తలొచ్చాయి. అయితే… పవన్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదట. యథావిధిగా అనుకొన్న సమయానికే మొదలుతుందని తేలిపోయింది. నవంబరు రెండోవారంలో పవన్ – త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన ముందస్తు కసరత్తులు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. త్రివిక్రమ్ ఇప్పటికే పవన్ కోసం దేవుడే దిగివచ్చినా అనే టైటల్ కూడా అట్టి పెట్టుకొన్నాడు. ఇటీవల సంగీత చర్చలు కూడా మొదలైపోయాయి. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ఈ సినిమాకి సంబంధించిన ట్యూన్లు రెడీ చేసే పనిలో ఉన్నాడు. “తెలుగులో ఓ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నా.పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆ చిత్రం తెరకెక్కుతోంది“ అని అనిరుథ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కాంబినేషన్ గుట్టు విప్పాడు. త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదని చెప్పడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఏం కావాలి??
త్రివిక్రమ్ గత నెల రోజుల నుంచి.. దేవుడే దిగి వచ్చినా కథా చర్చల్లో తలమనకలై ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకైనా మంచిదని దీనికి సమాంతరంగా మరో కథ కూడా సిద్దం చేశాడట. అయితే… దానికంటే పవన్‌కి దేవుడే దిగివచ్చినా.. లైన్ బాగా నచ్చిందని, దాన్నే వర్కవుట్ చేయమని చెప్పాడట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ సరికొత్త టీమ్‌ని కూడా ఏర్పాటు చేశాడట. ఇది వరకు త్రివిక్రమ్ సినిమాలకు పని చేసిన వాళ్లను ఈ సినిమా విషయంలో పక్కన పెట్టాడని టాక్. అసిస్టెంట్ డైరెక్టర్లూ, అసోసియేట్లూ అందరూ కొత్తవారేనట. దాంతో ఈ సినిమాకి ఫ్రెష్ నెస్ వస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. బయట ఎంత నెగిటీవ్ ప్రచారం జరుగుతున్నా.. కామ్‌గా తమ పని తాము చేసుకుపోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకే ఈ విషయంలో నోరు మెదపడం లేదని తెలుస్తోంది.