సునీల్, త్రివిక్రమ్‌ల స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటి నుంచీ ఇద్దరూ జాన్ జిగుర్ దోస్త్‌లు. ఇప్పటికీ అదే బంధం కొనసాగుతోంది. అందుకే సునీల్ దగ్గర ఎప్పుడు త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకొచ్చినా పరవశించిపోతుంటాడు. త్రివిక్రమ్ గురించి ప్రతీసారీ ఓ కొత్త విషయం చెబుతుంటాడు. ఈసారి బిరియానీ సీక్రెట్ బయటపెట్టాడు. సునీల్ మంచి భోజన ప్రియుడట. మరీ ముఖ్యంగా బిరియానీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ వచ్చిన కొత్తలో మూడు పూట్లా బిరియానీ లాగించేసేవాడట. ఫుల్లూ, ఆఫూ కాదు.. ఏకంగా ఫ్యామిలీ ప్యాక్. త్రివిక్రమ్ తనూ కలసి రెస్టారెంటుకు వెళ్లేవాళ్లమని, అక్కడ తాను చికెన్ బిరియానీ చెప్పుకొంటే త్రివిక్రమ్ వెజ్ బిరియానీ తినేవాడట. త్రివిక్రమ్ ఒక వెజ్ బిరియానీ తినేలోగా.. సునీల్ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఫుల్లుగా తినేసి.. త్రివిక్రమ్ ప్లేటు వంక ఆశగా చూసేవాడట. కొంత రైస్ పెడతాడని.
అంతే కాదు. సునీల్‌కి వెజ్ కర్రీస్ వండడం అంటే చాలా ఇష్టమట. రూమ్‌లో తానే వంట చేసేవాడట. త్రివిక్రమ్ రైటర్‌గా బిజీగా ఉన్నప్పుడు ఎక్కువ హోటెల్స్ లోనే బస చేయాల్సివచ్చేది. అక్కడే ఫుడ్డూ, బెడ్డూ. అయితే సునీల్ వండిన కూరల కోసం భోజనం వేళ.. త్రివిక్రమ్ రూమ్‌కి వచ్చేసేవాడట. కేవలం నాన్ వెజ్ తినాలన్న ఆశతో సునీల్.. త్రివిక్రమ్ బస చేసే హోటెల్‌కి వెళ్లి త్రివిక్రమ్ ఖాతాలో బిరియానీలు లాగించేసేవాడట. ఈ కబుర్లన్నీ సునీలే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా బిరియానీని వదల్లేకపోతున్నానని, అయితే.. డైటింగ్ చేయాల్సిన సమయంలో అస్సలు ముట్టుకోవడం లేదని, ఖాళీ సమయంలో మాత్రం బిరియానీని ఓ పట్టు పడతానని చెప్పుకొచ్చాడు సునీల్. అదీ… సునీల్ బిరియానీ స్టోరీ.