1970 వ దశకంనాటి అమితాబ్ బచన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి ఎవరు మర్చిపోతారు? అన్ని సినిమాల్లోనూ విజరు పేరుతో ఆయన చెప్పే డైలాగులు చూపించే కోపం థియేటర్లను వూపేసేవి. ఇప్పటికి ఆయనే దేశంలో అతి ఎత్తయిన నటుడు! కాకపోతే మొన్న 74వ జన్మదినోత్సవం చాలా ఘనంగా జరుపుకొన్నప్పుడు ఆయన ఈ ఇమేజిపై తమాషా అయిన వ్యాఖ్యలు చేశారు. యాంగ్రీ యంగ్మ్యాన్ను సృష్టించింది తాను కాదన్నారు. రచయితలు సలీమ్ జావేద్లు దాన్ని సృష్టించారు.మనలను ఎలా వాడుకోవాలో ఎలాటి పాత్రలు రూపొందించాలో వారికి దర్శకులకు బాగా తెలుస్తుంది అని ఆయన వినయంగా చెప్పారు. నేను జంజీర్ దీవార్లలో నటించినట్టే మిలీ, చుప్కే చుప్కే వంటి చిత్రాల్లోనూ నటించాను కదా! అయినా ఈ ఇమేజ్ వచ్చేసింది అని గుర్తు చేసుకున్నారు. ఇంతకూ బిగ్ బి 74 ఏళ్ల వయసులోనూ తీరిక లేకుండా నటిస్తూనే వుండటం విశేషం.ఇంత పని ఎలా చేయగలుగుతున్నారు అంటే పని ఇస్తున్నారు గనక చేస్తున్నాను అని ఠక్కున జవాబిచ్చేశారు. నాకోసం వేషాలు వస్తున్నాయి. వేస్తున్నాను. కాకపోతే ఆ రోజుల్లో వేసినవి ఇప్పుడు వేయలేను. సినిమా కూడా ఆటలవలెనే వయసుతో ముడిపడిన ప్రక్రియ. ఒక వయసు దాటాక అన్నిటినీ వేయడం కుదర్దు. మానసిక సంఘర్షణలూ, సంక్లిష్టతలూ వున్న పాత్రలు వేయొచ్చు. పికూ లాటివి. బాగా వయసున్న వ్యక్తి చిన్నమ్మాయిని ప్రేమిస్తే ఏమవుతుంది? వంటి పాత్రలు కూడా వేశాను అని గుర్తు చేసుకున్నారు. విశేషమేమంటే ఇప్పటికి అమితాబ్ చిత్రంలో వున్నాడంటే ప్రధాన పాత్రధారిగానే వుంటారు. మామూలు అర్థంలో హీరోగా వుండకపోవచ్చు. కాని కథలో కీలక పాత్ర మాత్రం ఆయనదే అవుతుంటుంది. ఆయన చుట్టూ తిరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఇంతకూ వయసును జయించిన ఈ పరిణత నటుడు ఇంత నిరాఘాటంగా దూసుకుపోతుంటే మన దగ్గర కొందరు హీరోలెందుకు ఇన్ని తర్జనభర్జనలు పడుతున్నట్టు?