తెలంగాణలో రాజకీయాలనూ మీడియానూ గమనిస్తున్న వారికి ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలి వరకూ మరీ బిక్కచచ్చినట్టు బిక్కుబిక్కు మన్న కొన్ని ఛానళ్లు పత్రికలు కూడా ఇప్పుడు కొంత గొంతు విప్పుతున్నాయి. కొత్తగా రాష్ట్రం రావడం, ఆ వెంటనే రెండు(ఖచ్చితంగా చెప్పాలంటే ఒకటే) ఛానళ్లపై నెపం దొరకడంతో వేటు వేయడం, తర్వాత కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరింపులు అదిరింపులు వంటి వాటి వల్ల ఒక దశలో అసలు మీడియా చైతన్యమే కొడిగట్టినట్టనిపించింది. వామపక్ష భావాలు గల నవతెలంగాణ వంటివి మినహా మిగిలిన వాటి మొదటి పేజీలలో ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రావడమే గగనమైంది. ఇదే సమయంలో ఓటుకు నోటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరలిపోవడం, జిహెచ్ఎంసి ఎన్నికలు తదితర పరిణామాల పరంపంరతో ఒక సమాచార నిశ్శబ్దం ఆవరించింది.
అధికార పత్రిక సరే ఎప్పుడూ పొగిడే వార్తలకే పరిమితమైంది.మామూలుగా వార్తల్లోనే గాక వ్యాఖ్యల్లోనూ సంపాదక రచనల్లోనూ కూడా పొగడ్దల వర్షమే. ఎపికూడా కొంతకాలం ఎన్టివిని తర్వాత సాక్షి ఛానల్ను ఇలాగే అడ్డుకున్నది. వీటన్నిటి ఫలితంగా జరిగిందేమంటే నిర్భయంగా రాసే లక్షణం కొడిగట్టింది. చర్చల్లో మాలాటివాళ్లం మాట్లాడుతున్నా యాజమాన్యాలను అభద్రతవెన్నాడిన స్థితి. ఇప్పుడిప్పుడే ఈ దశ మారడం మొదలైంది. మొన్న సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నిన్న కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి వంటివారు నేరుగా ఎడిటర్లతో మాట్లాడ్డం గోష్టులు నిర్వహించడం కూడా ఇందుకు దోహదం చేసింది. ప్రజల ఉద్యమాలు పాదయాత్రల వంటివి పెరగడం, ప్రభుత్వాలు సగం పదవీ కాలం పూర్తి చేసుకోవడం వంటివాటితో సమస్యలను దాటవేసి లేదా కప్పిపుచ్చి కథనాలు నడిపించే పరిస్థితి మారుతున్నది. అధికార టిపత్రికలో వీరవిధేయ వ్యాఖ్యాతలు దీనిపై తమ ఆక్రోశం వెలిబుచ్చడం కూడా జరుగుతున్నది. ఏమైతేనేం.. మీడియా గొంతు పెగుల్చుకోవడం మంచి విషయమే. అందులోనూ తప్పులు వుండొచ్చు వాటిని తప్పక విమర్శించవచ్చు, ఖండించవచ్చు. కాని అసలు అభద్రతలో మునిగిపోతే ప్రజలకు ఆ కాస్త సమాచారమైనా తెలిసే మార్గం వుండదు. ఇక రాబోయే రోజుల్లో ఎన్నికలు దగ్గరవుతాయి గనక మళ్లీ గతంలో వలె దాడిచేసేందుకు పాలకులు కూడా ప్రయత్నించకపోవచ్చు.