రాజ్యాంగం ప్రకారం బాధ్యతా యుతంగా పాలన అందించాల్సిన ప్రధాన జాతీయ ప్రాంతీయ పార్టీలే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క అని నిర్వచించుకునే మన ప్రజాస్వామ్య వ్యవస్థ మేడిపండుగా గోచరిస్తున్నది. అంతర్గతంగానే ప్రజాస్వామ్యం కాపాడుకోలేని పార్టీలు ప్రజాబాహుళ్యపు హక్కులు ఏం కాపాడతాయని సందేహం కలుగుతుంది. ఒకవైపున ధనబలం చెప్పుచేతల్లో మరోవైపున కుల మత శక్తుల ప్రాబల్యంతో అంతిమంగా కొన్ని కుటుంబాల చెప్పుచేతల్లో మన ప్రజాస్వామ్యం పెనుగులాడుతున్నది.
అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి.మొదట సీనియర్ బుష్ రెండు పర్యాయాలు, తర్వాత ఆయన బిల్‌క్లింటన్ రెండు పర్యాయాలు, ఆ తర్వాత మళ్లీ జూనియర్ బుష్ రెండుసార్లు, ఆ తర్వాత హిల్లరీ క్లింటన్ బారక్ ఒబామాతో రాజీలో భాగంగా విదేశాంగశాఖ నిర్వహించి , మరోసారి సెనేటర్ కావడం, ఇప్పుడు మళ్లీ అద్యక్ష ఎన్నికల్లో కార్పొరేట్ వర్గాల మద్దతు చూరగొనడం చూస్తుంటే అక్కడ కూడా రెండు కుటుంబాల చుట్టూ రాజకీయం తిరగడం కనిపిస్తుంది ఇది భారత దేశానికే పరిమితమైన లేదా వ్యక్తిగతమైన రాజకీయ లక్షణం కాదనీ, ఈ వ్యవస్థ కోరి పెంచుతున్నదనీ తేలిపోతుంది.
కాశ్మీర్‌తో మొదలు పెడితే షేక్ అబ్దుల్లా మరణం తర్వాత ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలు రాజ్యం చేశారు. 1980లలో అల్లుడు జిఎంషా ఫరూక్‌ను కూలదోసి కేంద్రం సహకారంతో ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పుడే అక్కడ పరిస్తితి దిగజారింది, దీన్ని ఆధారం చేసుకుని ముందుకొచ్చిన వారు తండ్రీకూతుళ్లు ముఫ్తిమహ్మద్ సెయిద్, మెహబూబాలు. బెజెపి ఎజెండాకు పూర్తి వ్యతిరేకమైన వాదనలు చేసిన పిడిపి అధికారం కోసం వారితో రాజీ పడింది. . మప్తీమహ్మద్ అనారోగ్యంతో మరణించిన తర్వాత మోహబూబా ,. బిజెపి దాగుడు మూతలతో శూన్యం ఏర్పడి ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగింది. అక్కడ పరిస్తితులు ఎంతగా దిగజారిపోతున్నది చూస్తున్నాం.
దేశంలోనే పెద్దవైన హిందీరాష్ట్రాలు యుపి బీహార్. ఉత్తర ప్రదేశ్‌లో కీలకమైన ఎన్నికల సమరం ప్రాంగణంలో సమాజ్‌వాదిపార్టీ సర్వాధినేత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కూ , ఆయన బాబాయి శివలాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అమర్సింగ్లకూ మధ్య నడుస్తున్న వివాదం ఇందులో ములాయం స్వయంగా కుమారుడికి వ్యతిరేకంగా వున్న వారిని ఆశీర్వదించడం అంతుపట్టని రభసగా మారింది.ఇప్పటికి ఇది ముగిసిన దాఖలాలు లేవు. . ఈ క్రమంలో ఒక శిబిరానికి చెందిన వారిపై మరో శిబిరం వారు శిక్షణా చర్యలు తీసుకోవడం, ములాయం కొమారుని వ్యతిరేకులను వెనకేసుకురావడం, వచ్చే ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకా ప్రకటించకపోవడం ఇవన్నీ రాజకీయ మతలబులే. మొన్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రధాని కావడానికి ప్రధాన కారణం యుపిలో ఏకంగా 71 స్థానాలు బిజెపి గెల్చుకోవడమే ఇందుకు సాక్షాత్తూ అమిత్‌షానే అక్కడ మకాం వేసి రాజకీయం నడిపారు. మోడీ నాయకత్వం నిలవాలంటే వచ్చే యుపి ఎన్నికల్లో విజయం సాధించడం తప్పనిసరి. మరోవైపున బిఎస్పి నాయకురాలు మాయావతి కూడా హౌరోహౌరి పోరాడుతున్నారు.గోరక్షణ దళం హత్యలు, మత కలహాలు, అయోధ్య పునరావృతం తదితర సవాళ్లు వెన్నాడుతున్నాయి.అరాచాకాలు నేరాలు అనేకం జరుగుతున్నాయి.ఇలాటి తరుణంలో పరిపాలనపై దృష్టి పెట్టేబదులు కుటుంబ కలహాల్లో మునిగితేలడం నిజంగానే అవాంఛనీయం. మోడీ ఇప్పటికి మూడు సార్లు పర్యటన జరిపారు. అమిత్ షా సర్వశక్తియుక్తులూ ప్రయోగిస్తున్నారు. చివరకు అఖిలేష్ కొత్తపార్టీ పెడతాడని అలా చేయడని రరకరకాల కథనాలు వదులుతున్నారు.ఏది ఏమైనా దీనివల్ల బిజెపికి మేలు అనేది మాత్రం అర్థం అవుతున్నది.సర్వేలు కూడా జోస్యం చెబుతున్నాయి.
బీహార్‌లోనూ ఆర్జేడి పార్టీ- లాలూయదవ్ కుటుంబ పురాణం తక్కువ కాదు.గడ్డి కుంభకోణంలో తను జైలుకు వెళ్లినపుడు భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేసిన ప్రబుద్దుడాయన. తర్వాత ఓటమి చవి చూసినా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిజెపితో తెగతెంపులు చేసుకున్నాక ఆయనతో కలసి అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా వుండగా కుమార్తె మీసా భారతి ఎంపిగా వున్నారు. మరో కుమారుడు తేజస్వియాదవ్ మంత్రి. యుపిలో వలెనే బీహార్‌లోనూ వీరిమధ్యన లుకలుకలు నడుస్తున్నాయని త్వరలోనే బయిటకు వస్తాయని బిజెపి నేతలు చెబుతున్నారు. వాస్తవానికి వీరందరికీ సంబంధించిన పలు వివాదాలు కూడా నడుస్తూనే వున్నాయి. లాలూ ఎలాగూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు గనక ఎప్పుడు పిల్లలకు పగ్గాలు అప్పగించాలని ఆశపడతారో తెలియదు.
దక్షిణభారతానికి వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాణాంతక పరిస్థితి కొద్దివారాల పాటు పాలనా వ్యవస్థలనే ప్రశ్నించేలా చేసింది. అపోలో ఆస్పత్రిలో ఆమె పరిస్తితి ఏమిటో అసలు సుషుప్తిలో వున్నారో సచేతనంగావున్నారో తెలియని స్థితి. మరోవైపున రకరకాల వదంతులు. ఆమెకు రాజకీయ జీవితం ఇచ్చిన ఎంజిఆర్ కూడా 1984లో ఇలాటి స్థితినే ఎదుర్కొన్నారనేది తెలిసిన విషయమే.. ఎన్నుకున్న ప్రజలకూ పార్టీ నేతలకూ కూడా వాస్తవ సమాచారం అందక అనుమానాలు పెంచింది. . ఆమె నెచ్చెలి శశికళ, ఆమెకు సన్నిహితులుగా పేరున్న ఐఎఎస్‌లు పాలనను నడిపించడం తప్ప అన్నా డిఎంకె పార్టీగా ప్రార్థనలకే పరిమితమైంది.గతంలో ఆమె కోర్టు కేసులు ఎదుర్కొన్నప్పుడు జైలుకు వెళ్లినపుడు మరొకరిని ముఖ్యమంత్రినే చేసిన వారు ఇప్పుడు నిజంగా ఆమె బాగుండకపోతే ముందే తాత్కాలిక ఏర్పాటు చేసి వుండొచ్చు. కాని అవేమీ లేకుండానే కాలం వెళ్లబుచ్చి తర్వాత మాత్రమే ఆమె చూసే శాఖలను బదలాయించామన్నారు. అప్పుడు కూడా ఆమె ఫోటో పెట్టి పాదుకాపట్టాభిషేకం తరహాలో నడిపించారు. అంతర్గత ప్రజాస్వామ్య లేమికి ఇంతకన్నా ఉదాహరణలు వుండవు. దీనిపై లేఖలు రాసిన ప్రతిపక్ష నేత కరుణానిధి డిఎంకెలోనే ఇదే తంతు. కుమారుడు స్టాలిన్ తన వారసుడని అధికారికంగా ప్రకటించేశారు. కాని మరో కుమారుడు అళగిరి, కుంభకోణాల కూతురు కనిమెళి వంటివారి పోటీ పుండనే వుంది. ఇప్పుడు ఆ కరుణానిధి కూడా ఆస్పత్రిలో చేరారు. కర్ణాటకలో దేవగౌడ కుటుంబం కూడా ఇందుకు భిన్నం కాదు. కాకుంటే ఆయన కుమారుడు కుమారస్వామి బిజెపితో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆయనకు ఇష్టం లేని వ్యవహారమన్న ప్రచారం జరిగింది గాని తీరా ఆ సర్కారు నడిచినంతకాలం ఆయన తెర వెనక చక్రం తిప్పుతూనే వచ్చారు. మరో కుమారుడు కూడా మంత్రిగా వున్నారు.ఇప్పుడైతే తండ్రీ కొడుకులు కలిసే రాజకీయాలు నడుపుతుంటారు.
తెలుగు రాష్ట్రాల పరిస్తితి కూడా ఇందుకు భిన్నమేమీకాదు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబంనుంచి కెటిఆర్ హరీష్ కవిత, ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ చక్రం తిప్పుతున్న తీరు నిత్యం కనిపించేదే. ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ కూడా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీడలో పెరిగినా మరణానంతరం తనుగా నిలదొక్కుకున్నాడు. కాని ఆయన కొద్ది మంది కుటుంబ సభ్యుల మాట తప్ప ప్రజాస్వామ్య ధోరణి పెరగాలని ఆ పార్టీ నేతలే అంటుంటారు. మహారాష్ట్రలో బాల్ థాకరే రాజ్థాకరేల మాదిరిగా టిఆర్ఎస్లో కెటిఆర్ హరీష్‌ల మధ్య వారసత్వ వైరుధ్యాలు కథలుగా నడిచినా జిహెచ్ఎంసి ఎన్నికలతో కెటిఆర్ ముందుకు రావడం ఖాయమై పోయింది. మొత్తంగా సమిష్టి నిర్ణయాలు ప్రజాస్వామిక ప్రక్రియ కాకుండా కుటుంబ సభ్యులకే అధికారం సంక్రమించడం ప్రాంతీయ పార్టీలలో తప్పనిసరి అని ఆ నాయకులు చెబుతుంటారు. అయితే అధ్వాన్న దశలో వున్న కాంగ్రెస్ నాయకత్వం తీసుకుని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ పడుతున్న తంటాలు, ప్రియాంకను తీసుకురావాలనే పిలుపులు కూడా ఇలాటి ఉదాహరణలే. బిజెపిలో ఇలాటివి వుండవంటారు గాని వాజ్‌పేయి వున్నప్పుడు ఆయన అల్లుడు రంజిత్ భట్టాచార్య వివాదాలకు కేంద్రబిందువయ్యాడు.
అందుకే ధనస్వామ్య వ్యవస్థలో జనస్వామ్యం అనేది ఘరానా స్వామ్యంగానే నడుస్తుంటుంది. ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా రకరకాల వ్యవస్థలు దాన్ని నిలబెడుతూ తమ ప్రయోజనాలు నెరవేర్చుకుంటాయి. ఇదో మేడిపండు వ్యవహారమే. హేమహేమీలైన నాయకులైనా క్రమశిక్షణకు లోబడి వుండటం, ప్రభుత్వ విధానాలు కూడా సమిష్టిగానే నిర్ణయించడం మూడు రాష్ట్రాలను పాలించిన సిపిఎం వంటిపార్టీలలో చూస్తాం. ప్రధాని పదవి వద్దని తీర్మానించిన, దాంతో విభేదించినా చివరి వరకూ పార్టీ గీత దాటని జ్యోతిబాసులు వాటిలోనే మనకు కనిపిస్తారు. అసాధారణమైన రీతిలో బహిరంగ వివాదం నడిపిన పినరాయి విజయన్ అచ్యుతానందన్‌లు కూడా కట్టుబడి వుండటం చూస్తాం. కమ్యూనిస్టుల్లో ప్రజాస్వామ్యం లేదనే వారు ఇదెలా జరుగుతుందో మాత్రం చెప్పరు. బిజెపిలోనూ మోడీ వచ్చే వరకూ వ్యక్తి ప్రాధాన్యం పరిమితుల్లో వుండేది గాని ఇప్పుడు కార్పొరేట్ పెట్టుబడుల ప్రభావం పెరిగాక ఆయన బొమ్మను ప్రచారం చేయడం కీలకమై పోయింది. అద్వానీ కూడా సర్దుకోకతప్పని స్థితి ఏర్పడింది. ప్రధాని నరేంద్రమోడీ భార్యనేేదూరంగా అనామకంగా వుంచారు గనక కుటుంబ సమస్యలు లేకపోయినా ఆయనను మరో విధమైన పరివారం సంఫ్ రూపంలో శాసిస్తుంటుంది. ఇదీ రాజ్యాంగేతరమే. పైగా అంబానీల ప్రభావం గాని అదానీల ఆధిపత్యం గాని కాదనలేని సత్యం.