ధనుష్ నటించిన అనువాద చిత్రం.. ధర్మయోగి. దీపావళి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావల్సిన సినిమా ఇది. అయితే… సాంకేతిక కారణాల వల్ల శుక్రవారం ఈ సినిమా విడుదల కావడం లేదు. శనివారానికి వాయిదా పడింది. చిత్రబృందం సాంకేతిక కారణాలు… అంటున్నా.. సెన్సార్ ఇబ్బందుల వల్లే ఈసినిమా విడుదల ఆగిందని తెలుస్తోంది. బుధవారం ఈ సినిమా సెన్సార్ జరగాల్సింది. అయితే అదే రోజున కాష్మోరా కూడా సెన్సార్ ముందు ఉండడంతో.. కాష్మోరా చూసి.. ఆ తరవాత ధర్మయోగి చూడాల్సివచ్చింది చిత్రబృందం. ధర్మయోగి చూసేటప్పటికే అర్థరాత్రి గడిచిపోయిందట. గురువారం ఉదయం కూడా సెన్సార్ నుంచి ఈ సినిమాకి క్లియరెన్స్ రాలేదు. సెన్సార్ చెప్పిన కొన్ని కట్స్ ని ఫాలో అయి.. సినిమాని రీ ఎడిట్ చేయాల్సివచ్చింది. అందుకే శుక్రవారం ఈ సినిమా విడుదల కావడం లేదు. తమిళంలో మాత్రం ‘కోడి’ యథావిథిగా విడుదల అవుతుంది. తెలుగు వెర్షన్ కోసమైతే మరో రోజు ఆగాల్సిందే.ధనుష సరసన త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి తెలుగులో తగినంత పబ్లిసిటీ దొరకలేదు. రఘువరన్ బీటెక్‌తో ధనుష్‌తో తెలుగులో పాపులారిటీ పెరిగింది. అయితే.. దాన్ని క్యాష్ చేసుకోవడంలో ధర్మయోగి చిత్రబృందం విఫలమైంది. ఈ విషయంలో ధనుష్ కూడా అసంతృప్తిగా ఉన్నాడట. ఇక ముందు తెలుగు హక్కులు అమ్మేముందు జాగ్రత్తగా ఉండాలని, పేరున్న సంస్థలకు, పబ్లిసిటీ చేసి పెడతారునుకొన్న నిర్మాతలకే హక్కుల్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యాడని టాక్.