మాస్ కథలు చేయగల స్టామినా ఉన్న కథానాయకుడు కార్తి.. ‘కాష్మోరా’ అనే టైటిల్ పెట్టుకొని ఓ హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు అనగానే ఆసక్తి పెరగడం ఖాయం. కాష్మోరా అనే టైటిల్.. కార్తి గెటప్.. విజువల్ ఎఫెక్ట్స్ సెటప్ ఇవన్నీ చూస్తే… కచ్చితంగా టికెట్ తెగ్గొట్టాలనిపిస్తుంది. ప్రచార చిత్రాల్లోని యుద్ద సన్నివేశాలు ఈ సినిమాపై ఆసక్తిని ఇంకాస్త పెంచేశాయి. థియేటర్‌కి వెళ్లాలన్న ఉత్సుకత తీసుకొచ్చాయి. ప్రచారం, కాంబినేషన్ సత్తా అనేది ప్రేక్షకుడ్ని థియేటర్‌కి రప్పించే వరకే! కూర్చోబెట్టగల దమ్ము కథ, కథనాల్లో ఉండాలి. మరి తొలి విషయంలో సక్సెస్ అయిన కాష్మోరా.. మలి విషయంలోనూ విజయం సాధించిందా? ఇంతకీ కాష్మోరా ఏ టైపు కథ? ప్రచారంలో ఉన్న దమ్ము సినిమాలోనూ ఉందా? చూద్దాం.. పదండి!
* కథ
కాష్మోరా (కార్తి), తన కుటుంబ సభ్యులు ఆత్మల్ని వశం చేసుకొని, దెయ్యాల్ని వదిలిస్తుంటారు. అయితే ఇదంతా బిల్డప్ మాత్రమే. వీటి వెనుక కాష్మోరా జిమ్మిక్కులు ఉంటాయి. టెక్నాలజీని ఆసరా చేసుకొని, ఆత్మల్ని వశం చేసుకొంటున్నామని నమ్మించి పబ్బం గడుపుతుంటాడు. వీటిపై గురి ఉన్న ఓ రాజకీయ నాయకుడు కాష్మోరాని గుడ్డిగా నమ్ముతాడు. ఐటీ రైడ్స్ జరుగుతుందన్న సమాచారం రావడంతో రూ.500 కోట్ల రూపాయలు, బంగారం, వజ్రాలూ… ఇవన్నీ కాష్మోరా ఇంట్లో దాస్తాడు. ఇదే అదును అనుకొని ఆ సొమ్ముతో కాష్మోరా కుటుంబం ఉడాయించాలనుకొంటుంది. అయితే ఓ ఆత్మని బంధించాలన్న పనిమీద ఊరి చివర ఉన్న దెయ్యాల కోటకు వెళ్తాడు. నిజానికి కాష్మోరా అక్కడికి వెళ్లలేదు. రాజ్ నాయక్ (కార్తి) అనే ఓ ఆత్మ కాష్మోరాని అక్కడికి రప్పించింది. కాష్మోరానే కాదు.. కాష్మోరా కుటుంబాన్ని మొత్తం ఆ దెయ్యాల కోటలో బంధిస్తుంది. ఇదంతా రాజ్ నాయక్ ఆత్మ ఎందుకు చేస్తోంది? అసలు ఆ ఆత్మకీ కాష్మోరాకీ ఉన్న సంబంధం ఏమిటి? ఐదు వందల యేళ్ల నాటి రాణీ రత్నమహాదేవి (నయనతార) ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
* నటీనటుల ప్రతిభ
అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది.. కార్తి గురించే. కార్తి ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ వేరు.. ఈ సినిమా వేరు. దొంగ బాబా కాష్మోరాగా, ఆత్మ రాజ్ నాయక్‌గా కార్తి నటన నివ్వెర పరుస్తుంది. రెండు పాత్రల మధ్య చాలా తేడా స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్ నాయక్‌గా కార్తి హావభావాలు, మాట తీరు, నడక అన్నీ వేరుగా కనిపిస్తాయి. ఆ పాత్ర కోసం తాను పడిన కష్టం అంతా తెరపై తెలుస్తూనే ఉంటుంది. ఇక దొంగ బాబాగా నవ్వులు పూయించాడు కార్తి. విశ్రాంతి ముందొచ్చే పది నిమిషాల సన్నివేశంలో కార్తి మోనో యాక్షన్‌తో అదరగొట్టేశాడు. ప్రధమార్థానికి ఆ పది నిమిషాల కార్తి నటనే హైలెట్. ఇక ద్వితీయార్థాన్ని నడిపించే బాధ్యత రాజ్ నాయక్ చూసుకొన్నాడు. రాణీ రత్నమహేదేవిగా నయన తార పాత్ర కాసేపే. కానీ ఉన్నంతలో బాగా నటించింది. వివేక్ సైలెంట్ సెటైర్లతో అదరగొట్టాడు. ఇక శ్రీదివ్య పాత్ర పరిధి అంతంత మాత్రమే.
* సాంకేతిక వర్గం
విజువల్ వండర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. కొన్ని షాట్స్… నిజంగానే మగధీర, బాహుబలి సినిమాల్ని గుర్తు చేస్తాయి. అయితే.. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ తేలిపోయాయి. సమయాభావం వల్ల చుట్టేసినట్టు కనిపిస్తుంటుంది. అయితే కీలక సందర్భాల్లో వీఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ బాగానే కనిపిస్తుంది. సంతోష్ నారాయణ్ పాటలేవీ అంతగా గుర్తుండవు. నిజానికి ఈ సినిమాలో పాటలు అనవసరం. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టపడ్డాయి. ఓ రొటీన్ కథని రాసుకొన్నాడు గోకుల్. అయితే దాన్ని వినోదం మేళవించి తీర్చిదిద్దగలిగాడు. సెకండాఫ్‌లో వచ్చే పిరియాడికల్ ఎపిసోడ్ తప్పకుండా ఆకట్టుకొంటుంది. క్లైమాక్స్.. యాజ్ టీజ్‌గా ఉంది.
* తెలుగుఉ 360.కామ్ విశ్లేషణ
కాష్మోరా ఏ జోనర్‌కి సరిపడా సినిమా అనేది స్పష్టంగా చెప్పలేం. ఇదో హారర్, కామెడీ అనుకోవొచ్చు. ఫాంటసీ ఉంది. పిరియాడికల్ ఉంది. బాబాలపై సెటైర్లు ఉన్నాయి. మొత్తంగా మగధీర, అరుంధతి సినిమాల లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే అరుంధతికి డిట్టో. అయితే అరుంధతిలో కామెడీ ఉండదు. కాష్మోరా మాత్రం కామెడీ చేస్తాడు. ప్రారంభ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. కాష్మోరా ఎప్పుడైతే డూప్ అని తెలిసిందో అక్కడి నుంచి.. కామెడీ మొదలవుతుంది. ఇంట్రవెల్‌కి ముందు కార్తి చేసిన షో.. తప్పకుండా ఈ సినిమాపై నమ్మకాన్ని గౌరవాన్నీ పెంచుతాయి. సెకండాఫ్ స్లోగా మొదలైంది. ఫ్లాష్ బ్యాక్ ఎసిసోడ్ కూడా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించదు. అరుంధతి టైపు క్లైమాక్స్‌తో శుభం కార్డు వేశాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో కార్తి తనలో ఆత్మ ఆవహించినట్టు ఇచ్చిన బిల్డప్ అయితే… మళ్లీ మనసారా నవ్వుకోవొచ్చు. ద్వితీయార్థంలో ఇంకాస్త కామెడీ మిక్స్ చేసుంటే బాగుండేది. దర్శకుడు ప్రేక్షకుల్ని నవ్వించాలి అనుకొన్న ప్రతీసారీ సక్సెస్ అయ్యాడు. అదొక్కటీ సరిపోతుంది అనుకొంటే.. కాష్మోరా తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది. బాహుబలి, మగధీరలాంటి సినిమాల్నిఊహించుకొంటూ వెళ్తే మాత్రం కష్టం. కానీ ఒక్కటి.. కార్తి ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడు. తన నటనతో నవ్వులతో.. గెటప్‌లతో ఈ సినిమాని కాస్త వన్ మ్యాన్ షోగా మార్చేశాడు.
తెలుగు360 రేటింగ్ : 2.75/5