అమరావతిలో అవసరం లేని మూడో శంకుస్థాపనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు పోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఆ సమయంలోనే గవర్నర్ నరసింహన్ను కలుసుకున్నారు. ఎపి అధీనంలోని సచివాలయ భవనాల అప్పగింత, నూతన నిర్మాణ పథకాలలో తలమునకలవుతున్నారు. నిజానికి పాత సచివాలయం విధ్వంసం అప్పుడే అవసరం లేదని భారీ వ్యయప్రయాసలు వద్దని అన్ని ప్రతిపక్షాలూ విమర్శించాయి.కొందరు మంత్రులు కూడా వారించారు. అయినా ఆయన వాస్తు కారణాలతో ముందుకే వెళ్తున్నారు. అయితే ఈ నమ్మకాలేమిటన్న చర్చ వస్తున్నది గనక మరో వాదన తీసుకొచ్చారు. ఈ రోజు నమస్తే తెలంగాణ పత్రిక పాత సచివాలయం గల్లీలతో ఇబ్బందుల మయంగా వుందని పెద్ద కథనం ప్రచురించింది. ఆంధ్రజ్యోతి వాస్తు గురించి రాసిన రోజున నమస్తే.. ఆ విషయాలు రాయలేదు. ఇప్పుడు రాజకీయ కోణాలు కూడా గమనంలో పెట్టుకుని ఇతర అంశాలు ముందుకు తెచ్చినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ గాక మరో అభిప్రాయం కూడా కెసిఆర్కువుందని ఆయన సన్నిహిత ప్రజా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా తీరంలో రివర్ బెడ్ క్యాపిటల్ కట్టిన తర్వాత కొత్తగా వుంటుంది. హైదరాబాదులోనూ హుసేన్ సాగర్ తీరంలో ఆకాశసౌధాలు నిర్మించి సచివాలయాన్ని కూడా ఆధునికంగా కట్టేస్తే ఇక్కడ ప్రజలకూ సంతోషంగా కొత్తగా వుంటుందనే భావన ఆయనకు వుందిగాని బయిటపెట్టడం లేదు. పాత రాష్ట్రపు వాసనలు కూడా లేకుండా చేయాలనే ధోరణి ఇంకోటి. ఏమైతేనేం ప్రస్తుతానికి అవసరం లేని ఖర్చు ప్రాధ్యాన్యతలు పాటించని పోకడలే.